CM Revanth Reddy Speech goes Viral: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో జరిగిన ఆగస్టు 15 వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఎగరవేసి.. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. అనంతరం పరేడ్లో పాల్గొన్నారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన వేడుకలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతుల రుణాల మాఫీ నుంచి మొదలుపెడితే సన్నధాన్యానికి బోనస్ వరకు అన్ని చేసుకుంటూ వస్తున్నామని రేవంత్ వెల్లడించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ క్రమశిక్షణ ద్వారా అన్ని పనులు చేస్తున్నామని రేవంత్ వివరించారు.
పంద్రాగస్టు వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లో ఉందని.. అని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభిస్తోందని రేవంత్ అన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నెలలకు ఉచిత బస్సు ప్రయాణం.. రైతులకు రుణమాఫీ.. ఉచిత విద్యుత్తు.. వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రేవంత్ వెల్లడించారు. ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు గృహాల నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున సహాయం చేస్తున్నట్టు రేవంత్ వివరించారు. మహిళా సాధికారత కోసం వడ్డీ రహిత రుణాలు ఇస్తున్నామని.. ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ వివరించారు. తెలంగాణ రైసింగ్ 2047 లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్టు రేవంత్ పేర్కొన్నారు.. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలని రేవంత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా తాను కేంద్రాన్ని అడుగుతున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన సున్నా నించి మొదలైందని.. ఎవరి బెదిరింపులకూ లొంగేది లేదని రేవంత్ స్పష్టం చేశారు.
పంద్రాగస్టు వేడుకల్లో రేవంత్ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎక్కడి దాకయినా వెళ్తామని రేవంత్ అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను ఇవ్వాల్సిందేనన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా.. వాటిని కచ్చితంగా ఎదుర్కొంటామని.. కృష్ణ, గోదావరి నదిలో ప్రతి చుక్కను కూడా సాధించుకుంటామని రేవంత్ పేర్కొన్నారు. తమ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు మీరు ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో గోదావరి నది మీద బనకచర్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి తగ్గట్టుగానే అక్కడి మంత్రులు, ఇతర అధికారులు మాట్లాడుతున్నారు. అయితే బనకచర్లకు తాము వ్యతిరేకమని.. తమకు ఇవ్వాల్సిన నీటిపాట ఇచ్చిన తర్వాతే ఎటువంటి పనులైనా చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి రేవంత్ స్పష్టం చేస్తున్నారు. పంద్రాగస్టు వేడుకల్లో కూడా అదే మాట మాట్లాడటంతో రేవంత్ చంద్రబాబుకు షాక్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై చంద్రబాబు ఎటువంటి కామెంట్స్ చేస్తారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.