Modi Viksit Bharat Rozgar Yojana: భారత దేశం 79వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటోంది. ఊరూరా.. వాడవాడలా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక వరాలు ప్రకటించారు. ‘నయా భారత్’ థీమ్ పేరుతో జాతీయ సమగ్రత, అభివృద్ధిని సాకారం చేసే దిశగా శక్తివంతమైన ప్రకటనలు చేశారు. ఆర్థిక సంస్కరణల నుంచి యువతకు ఉపాధి కల్పన వరకు ప్రధాని ప్రసంగం దేశ భవిష్యత్తును మలిచే లక్ష్యాలతో నిండి ఉంది.
యువతకు ఆర్థిక భరోసా..
ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యాన్ని మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద, ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన ప్రతి యువతీ యువకుడికి రూ. 15 వేల ఆర్థిక సాయం అందించబడుతుంది. రూ. లక్ష కోట్ల భారీ నిధులతో ఈ పథకం యువత ఆర్థిక స్వావలంబనను పెంపొందించడమే కాక, ఉపాధి సృష్టించే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు చైతన్యం తీసుకొస్తుంది. ఈ పథకం యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే అవకాశం ఉంది, ముఖ్యంగా గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లోని యువతకు ఇది గొప్ప వరంగా మారనుంది.
Also Read: అక్కడెలా సాధ్యమైంది.. కేదార్నాథ్ ఆలయ నిర్మాణంలో అంతుచిక్కని రహస్యాలు.. అక్కడ నిజంగానే శివుడున్నాడా..
ఆవిష్కరణలకు ప్రోత్సాహం..
యువతను ఉద్దేశించి మోదీ ఇచ్చిన సందేశం ఉత్తేజకరంగా ఉంది. ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని, ధైర్యంగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఆలోచనలను నిర్వీర్యం కాకుండా చూసుకోవాలని, ప్రభుత్వం వారి భాగస్వామిగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా, యువతకు అనుకూలమైన విధానాలను రూపొందించేందుకు వారి సూచనలను కోరడం గమనార్హం. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో యువత పాత్రను ఆయన ఉద్ఘాటించారు. ఈ పిలుపు యువతలో స్ఫూర్తిని రగిలిస్తూ, దేశాభివద్ధిలో వారిని భాగస్వాములను చేయనుంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనలు దేశ ఆర్థిక, సామాజిక భవిష్యత్తును శక్తివంతంగా మలిచే సామర్థ్యం కలిగి ఉన్నాయి. నయా భారత్ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా ముందడుగు వేశాయి. ఆర్థిక సంస్కరణల ద్వారా యువతకు, సామాన్యులకు ఆర్థిక భరోసా కల్పించే ఈ చర్యలు దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా మార్చే దిశలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.