Revanth Sarkar Debt: అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి చేస్తున్నామని చెబుతుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అప్పులు చేస్తున్నారని గగ్గోలు పెడుతుంది. మనదేశంలో ప్రతి రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం ఇలాంటి గోల జరుగుతూనే ఉంటుంది. దీనికి తెలంగాణ రాష్ట్రం మినహాయింపు కాదు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేసింది. ఆ అప్పుల మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేసినట్టు అప్పట్లో కేటీఆర్ సెలవిచ్చారు. ఆస్తుల కల్పన కోసమే తాము అప్పులు చేస్తున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలోకి మారిపోవడంతో.. అకస్మాత్తుగా ఆయనకు అప్పులు అంటే ఒక బ్రహ్మ పదార్థం లాగా కనిపిస్తోంది. అప్పులు చేయకూడదని.. అప్పుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుందనే పిలాసఫీ ఆయన నోటి వెంట నుంచి వస్తోంది. సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ కేటీఆర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా అప్పులు చేస్తుందనే మాట వినిపిస్తోంది.
ఇక అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి చేసిన అప్పులపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న అప్పులపై వ్యతిరేక స్వరం వినిపించారు. నిండు శాసనసభలో భారత రాష్ట్ర సమితి నాయకులను విమర్శించారు. అయితే నాడు అప్పును తప్పు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇప్పుడు అదే అప్పును తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పడం విశేషం.. అంతేకాదు భారత రాష్ట్ర సమితి చేసిన అప్పులను తాము తీర్చుతున్నామంటూ వివరించడం గమనార్హం. అటు భారత రాష్ట్ర సమితి కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులపై అనేక సందర్భాలలో.. వివిధ వేదికలపై విమర్శలు చేస్తోంది.
తాజాగా ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పుల గురించి ఒక సెటైరికల్ వీడియో రూపొందించింది. ఆ వీడియోను భారత రాష్ట్ర సమితి ఐటి విభాగంలో పనిచేసే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిని భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.. కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండానే.. ఈ వీడియో ద్వారా తన మనసులో ఉన్న మాటను మరోసారి కేటీఆర్ బయట పెట్టారు. ,”భారత రాష్ట్ర సమితి అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే.. ఉద్యోగులకు ఏరియర్స్ ఎందుకు చెల్లించలేదు.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించలేదు.. ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు అంతలా పెరిగిపోయాయి.. చివరికి ఔటర్ రింగ్ రోడ్డు ను కూడా తాకట్టు పెట్టారు కదా.. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అంత గొప్పగా ఉంటే ఇవన్నీ ఎందుకు జరిగాయని” కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.
Must watch video
On Telangana finances and how Congress lied & misled https://t.co/bMgcBCNjcx
— KTR (@KTRBRS) August 14, 2025