Ration Cards: రేషన్‌ కార్డులు రద్దు.. తెలంగాణ ప్రజలకు మరో షాక్‌ ఇవ్వబోతున్న రేవంత్‌ సర్కార్‌..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు మరో షాక్‌ ఇవ్వబోతోంది. ఇప్పటికే విద్యుత్‌ చార్జీల పెంపునకు సిద్ధమైంది. తాజాగా పేదలకు జలక్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : September 25, 2024 11:20 am

Ration Cards

Follow us on

Ration Cards: తెలంగాణలో పలు ఉచిత హామీలతోపాటు, అనేక ఉచిత హామీలతో 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై రేవంత్‌ సర్కార్‌ దృష్టిపెట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. రైతుల పంట రుణాలు రూ.2 లక్షల వరకు మాఫీ చేసింది. రైతుభరోసాకు సిద్ధమవుతోంది. ఖరీఫ్‌లో సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. హామీలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నట్లు కనిపిస్తున్న సర్కార్‌ త్వరలో ప్రజలకు షాక్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే విద్యుత్‌ చార్జీల పెంపునకు ఈఆర్సీలు ప్రతిపాదనలు చేశాయి. దీనిపై రెండు మూడు నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక తాజాగా రేషన్‌ కార్డులు రద్దు చేసే ఆలోచనలో ఉంది.

15 లక్షల రేషన్‌ కార్డులు రద్దు..
రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నట్లు అంచనా.. వీటిలో సుమారు 15 లక్షల రేషన్‌ కార్డులను రద్దు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కార్డు దారులను గుర్తించేందుకు గత ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టింది. పలుమార్లు గడువు పొడిగించింది. అయినా చాలా మంది వివిధ కారణాలతో ఈ కేవైసీ చేసుకోలేదు. కొందరికి వేలిముద్రలు రాకపోవడంతోనే చాలా మంది ఈ కేవైసీ చేసుకోలేదు. కానీ, సమస్యను గుర్తించకుండా ప్రభుత్వం ఈకేవైసీకి హాజరు కానివారి రేషన్‌కార్డులు రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది. సుమారు 15 లక్షల కార్డులు రద్దవుతాయని తెలుస్తోంది.

అక్టోబర్‌ 2 నుంచి కొత్త కార్డులకు దరఖాస్తులు..
ఇక అక్టోబర్‌ 2 నుంచి కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈమేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర జనాభా 3.83 కోట్ల మంది ఉన్నారు. 89.96 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. దరఖాస్తుదారుడి అర్హతలను గత ప్రభుత్వం విచారణ చేయకుండానే కార్డులు జారీ చేసిందని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. ఇలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు గత ప్రభుత్వం ఈ–కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ ఆరు నెలలపాటు కొనసాగింది. ఈ ఏడాది మార్చిలో ముగిసింది. సుమారు 15 లక్షల కార్డుదారులు ఈ–కేవైసీ చేసుకోలేదని తెలిపింది. చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, వేలి ముద్రలు పడని కారణంగా ఈ కేవైసీ చేసుకోలేదని తెలుస్తోంది. దీంతో వీరిని అన్హులుగా నిర్ధారించే అవకాశం ఉంది. 15 లక్షల కార్డులు రద్దు చేసి… వాటిని కొత్త కార్డులతో రద్దు చేయనున్నట్లు తెలిసింది.

ఏటా పెరిగిపోయిన కార్డులు..
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 3.60 లక్షల కొత్త రేషన్‌ కార్డులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసింది. హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల సమయంలో ఈ కార్డులు జారీ అయ్యాయి. ఇక కార్డులు ఉన్నవారిలో చాలా మంది కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఇప్పటి వరకు 12 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కార్డుల జారీ పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు కొత్త విధానం అమలు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పౌరుల వివరాలు ఉన్నాయి. సిటిజన్‌ 360 పేరుతో గత ప్రభుత్వం సమాచారం సేకరించింది. ఈ సమాచారం ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేసింది. రేషన్‌ కార్డుల జారీకి ఇదే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే ఆలోచనలో ఉంది. తహసీల్దార్లకు కూడా మూడు నెలల క్రితం సిటిజన్‌ 360 సమాచారం అందించింది. దీని ఆధారంగా రేషన్‌కార్డుల అర్హులను గుర్తించే అవకాః ఉంది.