YSR Congress Party : వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒకవైపు టీటీడీ లడ్డు వివాదం పెను దుమారం రేపుతోంది. పార్టీకి తల వంపులు తెచ్చిపెడుతోంది. మరోవైపు రాజకీయంగాను సమస్యలు తప్పడం లేదు. మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు అదే బాటలో పడ్డారు ఆర్. కృష్ణయ్య.ఆయన సైతం రాజ్యసభ పదవికి రాజీనామా ప్రకటించారు. త్వరలో బిజెపిలో చేరుతారని తెలుస్తోంది.అయితేఇద్దరు రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసిన సమయంలో.. జగన్ బుజ్జగింపులకు దిగారు. దీంతో వైసిపి రాజ్యసభ సభ్యులు ఎవరికి వారుగా మీడియా ముందుకు వచ్చారు. పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించారు. చివరి వరకు జగన్ తో కలిసి అడుగులు వేస్తామని చెప్పుకొచ్చారు. దీంతోవైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుల జంపింగ్ ఆగిపోయిందని అంతా భావించారు. కానీ తాజాగా ఆర్.కృష్ణయ్య రాజీనామాతో వైసిపికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయ్యింది. ఆయన బాటలో మరో నలుగురు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మేడా మల్లికార్జున్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
* 8 కి తగ్గిన బలం
ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 8కి పడిపోయింది. త్వరలో మరో నలుగురు పార్టీని వీడుతారని తెలుస్తోంది. పార్టీలో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావించిన వారు.. పదవులను సైతం విడిచిపెడుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలతో సంబంధం ఉన్న నేతలు వైసీపీలో ఉండడం ఎంత మాత్రం క్షేమం కాదని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా పార్టీతో పాటు రాజ్యసభ పదవులకు సైతం రాజీనామాలు చేయాలని చూస్తున్నారు.
* తృణప్రాయంగా విడిచి పెడుతున్న నేతలు
వాస్తవానికి రాజ్యసభ సభ్యుడి పదవి అంటే చాలా పెద్దది. దానికోసం నేతలు ఎదురు చూస్తుంటారు. అటువంటిది ఆ పదవిని తృణప్రాయంగా విడిచి పెడుతున్నారు వైసిపి ఎంపీలు. పార్టీపై నమ్మకమైన ఉండకపోవాలి. లేకుంటే ప్రలోభాలకు లొంగి ఉండాలి.. ఇంకాస్త దూరం వెళ్తే వ్యాపారాలు చేసైనా ఉండాలి. ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని భయపడాలి. అయితే వైసీపీలోని రాజ్యసభ సభ్యుల్లో ఎక్కువమందికి వ్యాపార సంస్థలు ఉన్నాయి. పరిశ్రమలు కొనసాగుతున్నాయి. అందుకే వారు పదవుల కంటే.. సొంత వ్యాపారాలకు ఎక్కువ విలువ ఇచ్చి స్వచ్ఛందంగా పదవులు నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
*ఇద్దరే మిగులుతారా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగేది ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యులు అని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఇంకొకరు తన అనుచరుడు విజయసాయిరెడ్డి. వారిద్దరూ అత్యంత సన్నిహితులే. వారు పార్టీ నుంచి వెళ్ళిపోయినా.. ప్రత్యర్థి పార్టీలు వారిని తీసుకోవు. అందుకే రాజ్యసభలో వైసిపి సంఖ్య రెండు కు పరిమితం కానుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాజ్యసభ ఆకర్ష్ ప్రయోగం చేస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే వైసీపీ సభ్యులు వరుస పెట్టి రాజీనామాలు చేయడం జగన్ శిబిరంలో కలవరం రేపుతోంది.