Kamala Harris: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 5న జరుగనున్నాయి. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. పతాకస్థాయిలో ప్రచారం జరుగుతోంది. సభలు, సమావేశాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ ఉచిత ఐవీఎఫ్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 10న అధ్యక్ష రేసులో మొదటి రెండు స్థానాల్లో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌లో కమలా పైచేయి సాధించారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో సర్వే సంస్థలు అంచనా వేయలేకపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఇద్దరి మధ్య ఓట్ల తేడా నాలుగు శాతం మించడం లేదు. ఈ క్రమంలో గెలుపు చెప్పడం కష్టమని సర్వే సంస్థలే ప్రకటిస్తున్నాయి. అయితే కమలా హారిస్‌కు కాస్త ఎడ్జ్ ఇస్తున్నాయి. ట్రంప్ మొదట్లో దూకుడు ప్రదర్శించినా డిబేట్ తర్వాత రేసులో వెనుకబడ్డారు.
కాల్పుల కలకలం..
అధ్యక్ష ఎన్నికల వేళ.. అభ్యర్థులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. జూలైలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి లక్ష్యంగా పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన తర్వాత ట్రంప్‌పై సానుభూతి పెరిగింది. అయితే అప్పటి వరకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్న జో బైడెన్ కాల్పుల ఘటన తర్వాత అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రేసులోకి వచ్చారు. కమలా తన వాక్‌చాతుర్యంతో ట్రంప్‌ను వెనక్కు నెడుతున్నారు. ఈ క్రమంలో వారం క్రితం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో తన గోల్ఫ్ కోర్సులో ఉన్న సమయంలో సమీపంలోనే కాల్పుల శబ్దాలు వినిపించాయి. అప్రమత్తమైన పోలీసులు సమీపంలో గాలించగా ఓ వ్యక్తి తుపాకీతో కనిపించాడు. అతడు ట్రంప్‌ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరిగింది.
కమలా టార్గెట్‌గా..
ఇక తాజాగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ లక్ష్యంతా తాజాగా కాల్పులు జరిగాయి. హారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యలయంపై గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాల్పుల్లో కార్యాలయం కిటికీలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు కార్యాలంలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ కాల్పుల ఘటన సంచలనంగా మారింది. కమలా ఎన్నికల రేసులో ముందు ఉన్నారు. తాజా సర్వేల ప్రకారం.. ఆమె ఆసియన్ అమెరికన్ ఓటర్లలో 38 పాయింట్లతో అధిక్యంలో ఉన్నారు. చికాగో విశ్వవిద్యాలంలో ఎన్‌ఓఆర్సీ నిర్వహించిన సర్వేలో 66 శాతం ఆసియా అమెరికన్ ఓటర్లు హారిస్‌కు మద్దతు తెలిపారు. ట్రంప్‌కు కేవలం 28 శాతం మాత్రమే మద్దతుగా నిలిఆరు. ఈ తరుణంలో కాల్పులు జరుగడం చర్చనీయాంశమైంది. అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను దుండగులు టార్గట్ చేయడం ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారింది.