https://oktelugu.com/

BRS Party : ఈ బీఆర్ఎసోళ్లు ఇక మారరా.. ఇంట చేయక.. ‘రచ్చ’ చేస్తారా?

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. అందులోనూ కేసీఆర్ కూడా రాజకీయాల్లో చాణక్యుడు. కానీ.. కొన్ని వారి అనాలోచిత నిర్ణయాలతో పార్టీ మరింత మసకబారే ప్రమాదం ఏర్పడింది. అంత మంది సీనియర్లు ఉండి కూడా ఇంత వైల్డ్‌గా ఎలా ఆలోచిస్తున్నారా అని అంతటా చర్చ నడుస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 14, 2024 / 02:07 PM IST

    BRS Party

    Follow us on

    BRS Party :  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి పది నెలలు గడిచింది. గత పది నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొలువుదీరినప్పటి నుంచి బీఆర్ఎస్ అటాకింగ్ చేస్తూనే ఉంది. అటు కాంగ్రెస్ నేతలు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ కానీ బీఆర్ఎస్ విమర్శలను అదే స్థాయిలో తిప్పిగొడుతున్నారు. అయితే.. పదేళ్ల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీసం సమయం కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపైనా పలు విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలైనా గడవక ముందే అప్పటి నుంచే విమర్శలు మొదలు చేయడంతో బీఆర్ఎస్ పైనే చాలా వరకు వ్యతిరేకత వచ్చినట్లు కనిపించింది.

    అయితే.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. అందులోనూ కేసీఆర్ కూడా రాజకీయాల్లో చాణక్యుడు. కానీ.. కొన్ని వారి అనాలోచిత నిర్ణయాలతో పార్టీ మరింత మసకబారే ప్రమాదం ఏర్పడింది. అంత మంది సీనియర్లు ఉండి కూడా ఇంత వైల్డ్‌గా ఎలా ఆలోచిస్తున్నారా అని అంతటా చర్చ నడుస్తోంది.

    తాజాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఢిల్లీలో ధర్నా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా రాహుల్ గాంధీ ఇంటి ముందు చేస్తారట. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఢిల్లీలో ధర్నాలు చేయడం ఏంటని ముక్కు మీద వేలేసుకుంటన్నారు. స్థానిక సమస్యలపై స్థానికంగా కొట్లాడాది కానీ.. అక్కడెక్కడో ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం దేనికి అని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే అక్కడికి వెళ్లి ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీకి వెళ్తామని చెప్పడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.

    గత అసెంబ్లీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ తెలంగాణలో చాలా చోట్ల ప్రచారం చేశారు. ఆ సందర్భంలో పలు హామీలు ఇచ్చారు. అయితే.. ఆయన ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కావడం లేదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. వీరి ఆరోపణలకు కాంగ్రెస్ కూడా సమాధానమిచ్చింది. ఉచిత బస్సు, రుణమాఫీతోపాటు చాలా పథకాలు అమలు చేశామని చెబుతోంది. పెండింగులో ఉన్న వాటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అంటోంది. కానీ.. ఇంకా అమలు కాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేసేందుకు నిర్ణయించారు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి హామీలు ఇచ్చి వెళ్లారు కాబట్టి.. తాము ఢిల్లీ వెళ్లి ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీజేపీతో కుమ్మక్కయి ఢిల్లీకి వెళ్లి రాహుల్ ఇంటి ముందు ధర్నా చేసేందుకు బీఆర్ఎస్ ఆలోచన చేసిందని మరోవైపు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా బీఆర్ఎస్ నేతలు స్థానిక సమస్యలపై స్థానికంగా కొట్లాడితే మైలేజీ రావడంతోపాటు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండేది. కానీ.. ఎక్కడో దేశ రాజధానిలో చేస్తే ఆ పార్టీకి ఏం కలిసొస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.