Hydra demolitions : కొందరు చేపట్టే పనులు కొందరికి అనర్థాలు అయితే.. మరికొందరికి మంచి చేస్తుంటాయి. సరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో కూడా ఇదే జరిగింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రేవంత్ హైడ్రాను తీసుకొచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని వరదల బారి నుంచి సంరక్షించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తూ వస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారు.
అయితే.. హైడ్రా చర్యలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నా చాలా మందికి మాత్రం పెద్ద గుణపాఠం నేర్పింది. అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం కళ్లు తెరిపించారని చెప్పాలి. అక్రమార్కుల వలలో పడకుండా.. ఎలాంటి ఆస్తులను కొనాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని హైడ్రా ఒకవిధంగా గుర్తుచేసింది. హైదరాబాద్‌లో వృత్తిరీత్యా, వ్యాపారం నిమిత్తం చాలా మంది గ్రామాల నుంచి వలస వచ్చి బతుకుతున్నారు. దాంతో ఇక్కడ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కొంత మంది రియల్టర్ల మోసాలకు బలవుతున్నారు.
చాలా మంది రియల్టర్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అధికారులను మచ్చిక చేసుకొని నామమాత్రంగా పర్మిషన్లు తీసుకొని కట్టడాలు చేపట్టారు. అయితే.. అలా చాలా మంది వేలాదిగా ఇళ్లను ప్రజలు కొనుగోలు చేశారు. అన్ని అనుమతులు ఉన్నాయనుకున్న వీరు కొన్నారు. ఇప్పుడు హైడ్రా వాటన్నింటినీ నేలమట్టం చేస్తూ వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కూల్చివేతల్లో పెద్ద పెద్ద అపార్టుమెంట్లు సైతం ఉన్నాయి. కోట్ల విలువ చేసే విల్లాలు సైతం ఉన్నాయి. హైడ్రా వేటిని కూడా వదలకుండా అన్నింటినీ కూల్చివేస్తూ వచ్చింది. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరికీ ఒకటే న్యాయం అన్నట్లుగా ప్రభుత్వం సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతోంది.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు కొనుగోలు చేయకుండా హైడ్రా పలు జాగ్రత్తలు సూచించింది. అయితే.. ఏ కట్టడం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదో.. ఏది బఫర్ జోన్లో ఉందో కూడా ప్రజలకు కనిపెట్టడం కష్టం. ఇప్పడు ఈ సమస్య లేకుండా హెచ్ఎండీఏ కొత్త వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ పరిధిలోని చెరువులను గుర్తించి, వాటి బఫర్ జోన్‌ను నిర్ణయించింది. దీని ద్వారా బఫర్ జోన్ ను ఈజీగా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. lakes.hmda.gov.in అనే వెబ్ సైట్‌లో పూర్తి వివరాలు పొందుపరిచింది. ఇందులో జిల్లా, మండలం, గ్రామం పేరుతో మీ స్థలం బఫర్ జోన్ లేదా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు. బఫర్ జోన్ పరిధిలో వ్యవసాయం లేదంటే ఇతర వ్యవసాయ ఆధారిత పనులు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ.. శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధనలు ఉన్నాయి. కొత్త వెబ్ సైట్ తీసుకురావడంతో ఇప్పుడు అందరూ కూడా కాస్త రిలాక్స్ అయ్యారు. కొనుగోలు చేసే కట్టడం ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నదా అనే తెలుసుకునే అవకాశం ఉండడంతో రేవంత్ రెడ్డిని ఓ వైపు మెచ్చుకుంటున్నారు.