Phanindra Sama: మనకు సమస్య వచ్చినప్పుడు, లేదా అవసరం అయినప్పుడు దానిని పరిష్కరించుకోవడానికి, అవసరం తీర్చుకోవడానికి ఆలోచన చేస్తాం. ఆ ఆలోచన నుంచే సమస్యకు పరిష్కారం వెతుకుతాం. నూతన ఆవిష్కరణకు బీజం అక్కడ పడుతుంది. ప్రస్తుతం మనం ఉపయోగించే ప్రతీ వస్తువు వెనక ఆలోచన, అవసరం నుంచి పుట్టినవే. ఇలాగే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి బస్ టికెట్ దొరకలేదని, పండుగకు కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లలేకపోయానని ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది నుంచే ఆయనకు ఆలోచన పుట్టింది. తనలా ఎవరూ ఇబ్బంది పడొద్దన్న ఆలోచనతో ఓ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు రూ.6 వేల కోట్ల సంస్థగా మారింది.
2006లో రెడ్‌బస్..
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఫణీంద్రసామా దిపావళి పండుగకు కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు హైదరాబాద్ వెళ్లాలనుకున్నాడు. బెంగళూరు అంత తిరిగినా ఎక్కడ బస్ టికెట్ దొరకలేదు. పండగపూట ఫ్యామిలీని మిస్ అయినందుకు బాధపడ్డాడు. ఇక తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదనుకున్నాడు. అసలు సమస్య ఎక్కడ ఉందో కొనిపెట్టాడు. బస్ ఆపరేటర్లకు, ట్రావెల్ ఎజెన్సీలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడంతో కొన్ని బస్సులు ఖాళీగా వెళ్తున్నాయని, కొన్ని ఓవర్ లోడ్‌తో వెళ్తున్నాయని గుర్తించాడు. దీనిని పరిష్కరించేందుకు 2006లో రెడ్‌బస్ అనే సంస్థను తన ఇద్దరు మిత్రులతో కలిసి స్థాపించాడు.
తక్కువ సమయంలోనే అభివృద్ధి..
ఇక ఈ రెడ్‌బస్ సంస్థ తక్కువ సమయంలోనే అంచనాలకు మించి ఎదగడంతో దీనిని 2013లో ఐబిబో సంస్థ రూ.800 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. తర్వాత మూడేళ్లకే దానిని మేక్ మై ట్రిప్ సంస్థ 2016లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం దీని విలువ రూ.6 వేల కోట్లు. ఇలా ఒక ఆలోచన రూ.6 వేల కోట్ల సంస్థను స్థాపించేలా చేసింది.