Vijayashanti: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. బీఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందం కొనసాగుతుందని చాలా మంది నాయకులు ఇప్పటికే పార్టీని వీడారు. తాజాగా విజయశాంతి కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. అయితే, తాను ఏ పార్లీ చేరతానో వెల్లడించలేదు. విశ్వనీయవర్గాల సమాచారం ప్రకారం.. రెండు రోజల్లో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.
కొన్ని రోజులుగా ప్రచారం..
విజయశాంతి కొన్ని నెలలుగా బీజేపీలో అసంతృప్తిగా ఉంటున్నారు. పార్టీ నియమించిన 14 కమిటీల్లో ఆమెను ఆందోళన కమిటీ చైర్‌పర్సన్‌గా చేశారు. ఆమె తన ఆందోళన గురించి తప్ప పార్టీ తరఫున చేయాల్సిన ఆందోళనల గురించి పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయలేదు. దీంతో ఆమె బీజేపీని వీడతారన్న ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ నేత మల్లు రవి ఇటీవల ఆమె కాంగ్రెస్‌లో చేరతారని ప్రకటించారు. అప్పుడు స్పందించిన విజయశాంతి.. అలాంటిదేమీ లేదంటూ ఖండించారు. ఈనెల 11న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు స్వాగతం కూడా పలికారు. కానీ, నాలుగురోజుల్లోనే విజయశాంతి బీజేపీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం కాషాయ పార్టీలో సంచలనంగా మారింది.
విజయశాంతి లేటెస్ట్ ట్వీట్..
‘తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదే. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరు.’ అని ట్వీట్ చేశారు.
బీజేపీ–జనసేన పొత్తుపై కినుక..?
విజయశాంతి బీజేపీ, జనసేన పొత్తుపై కినుక వహించారని తెలుస్తోంది. గతంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ బీజేపీ కార్యాలయానికి వచ్చినప్పుడు కూడా ఆమె సమావేశం నుంచి వెళ్లిపోయి నిరసన తెలిపారు. తాజాగా ఎన్నికల వేళ బీజేపీ జనసేన పొత్తును ఆమె అంగీకరించడం లేదని సమాచారం. రాజీనామాకు ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి పొత్తును కారణంగా చెప్పి ఉండవచ్చని బీజేపీ నాయకులు అంటున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ స్థానికంగా పొత్తులు సహజమని వెల్లడించారు.
బీఆర్‌ఎస్–బీజేపీ బంధంపైనా..
ఇక బీజేపీ రహస్యంగా బీఆర్‌ఎస్‌తో మైత్రి కొనసాగిస్తోందన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అందులో భాగంగానే అధ్యక్షుడిగా సంజయ్‌ను తప్పించి కిషన్‌రెడ్డిని నియమించారని తెలుస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ సర్కార్ అక్రమాలపై ఎలాంటి విచారణ జరుపకపోవడం, లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడం, కాళేశ్వరంలో అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అంటి అంశాలు బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య మైత్రి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయశాంతి రాజీనామాకు ఇది కూడా ఒక కారణమై ఉంటుందని తెలుస్తోంది. మొదటి నుంచి తన పోరాటం కేసీఆర్‌పైనే అని చెబుతున్న విజయశాంతి బీజేపీ–బీఆర్‌ఎస్ రహస్య మైత్రిని జీర్ణించుకోలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఇంకా ఎన్ని పార్టీలు మారుతుందో..
ఇదిలా ఉండగా విజయశాంతి పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించిన విజయశాంతి నాడు కేసీఆర్ పిలుపుతో టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. పార్టీలో నంబర్ 2గా ఎదిగారు. మెదక్ ఎంపీగా కూడా గెలిచారు. తర్వాత కేసీఆర్‌తో విభేదాలు రావడంతో పార్టీని వీడారు. కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీని వీడి మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుసోతంది. దీంతో విజయశాంతికి రాజకీయ స్థిరత్వం, సిద్ధాంతం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని పార్టీలు మారతావని ప్రశ్నిస్తున్నారు.