Rajiv Gandhi Airport : మనదేశంలో అత్యంత రద్దీ విమానాశ్రయాలలో శంషాబాద్ ఒకటి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విమానాలతో ఆ ప్రాంతం ఎప్పటికీ హడావిడిగా ఉంటుంది. వచ్చిపోయే ప్రయాణికులతో సందడి వాతావరణం కనిపిస్తుంది. అలాంటి చోట మనుషులు, విమానాలు, ఇతర వాహనాలు తప్ప.. జంతువుల అలికిడి వినిపించదు. కానీ, ఓ చిరుతపులి ప్రవేశించడం కలకలాన్ని సృష్టించింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గొల్లపల్లి ప్రాంతం నుంచి ప్రహరీ గోడ దూకి చిరుత ప్రవేశించడం ఆందోళన కలిగిస్తుంది. చిరుత పులి ఈ ప్రాంతంలో గోడ దూకినట్టు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. చిరుత పులి గోడ పైనుంచి దూకుతున్నప్పుడు ఫెన్సింగ్ వైర్లకు దాని శరీరం తగలడంతో అలారం మోగిందని అధికారులు చెబుతున్నారు. చిరుత పులి మాత్రమే కాకుండా దాని వెంట రెండు పిల్లలు కూడా ఉన్నాయని అధికారులు అంటున్నారు.
గొల్లపల్లి వద్ద విమానాశ్రయానికి, గ్రామానికి మధ్యలో పెద్ద గోడ కట్టారు. దానిపైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే చిరుత పులి దాని పైనుంచి దూకడంతో ఫెన్సింగ్ శరీరానికి అంటుకుంది. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వారు తేరుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో చిరుత పులి గోడ దూకిన దృశ్యాలు కనిపించాయి. దాంతోపాటు రెండు పిల్లలు కూడా ఉన్నాయి. వాటి వయసు 3 నుంచి 4 నెలల దాకా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చిరుత పులి దారితప్పి ఇటు వచ్చిందా? లేక వేటాడేందుకు విమానాశ్రయం గోడ పై నుంచి దూకిందా? అనే కోణాలలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
విమానాశ్రయంలోకి పులి ప్రవేశించిందని తెలియడంతో.. దానికి కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరా ఏర్పాటు చేశారు. పలుచోట్ల బోన్లు అందుబాటులో ఉంచారు. ఏ క్షణమైనా తాము చిరుత పులిని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పులి జాడలు కనిపిస్తే తమకు ఫోన్ చేయాలని అటవీశాఖ అధికారులు ఇప్పటికే విమానాశ్రయంలో పలుచోట్ల ఫ్లెక్సీలు, ఇతర బోర్డులు ఏర్పాటు చేశారు. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్టులో కి చిరుత వచ్చిందని వార్త సంచలనం సృష్టించింది. గతంలోని గొల్లపల్లి ప్రాంతంలో చిరుతపులు సంచరించాయి. శివారు ప్రాంతాల్లో రైతులకు చెందిన పశువులపై దాడులు చేసి ప్రాణాలు తీశాయి. అప్పట్లో అటవీశాఖ అధికారులు పులులను బంధించి నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత గొల్లపల్లి ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం సృష్టిస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన వృక్షాలు ఉంటాయి. గతంలో ఈ ప్రాంతం అడవి అని తెలుస్తోంది. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మృగాలు ఆహార అన్వేషణలో భాగంగా ఈ ప్రాంతానికి వస్తున్నట్లు తెలుస్తోంది.. అవి దారి తప్పి విమానాశ్రయంలో ప్రవేశిస్తున్నాయి. కొన్నిసార్లు శంషాబాద్ శివారు ప్రాంతాల్లో రైతుల పశువుల మీద దాడి చేసి.. తినేస్తున్నాయి. అలాంటి ఘటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. గతంలోనూ శంషాబాద్ విమానాశ్రయంలోకి క్రూర మృగాలు ప్రవేశించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు వాటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించారు. కొన్నింటిని నల్లమల అడవిలో వదిలిపెట్టారు. ఆ సంఘటనలు మర్చిపోకముందే మరో చిరుత పులి విమానాశ్రయంలోకి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది.