https://oktelugu.com/

SRH : ఈ తప్పులే హైదరాబాద్ కొంపముంచుతున్నాయి.. సరి దిద్దుకోపోతే ప్లే ఆఫ్ కష్టమే

అప్పుడే హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్లగలుగుతుంది. కప్ రేసులో నిలబడగలుగుతుంది. లేకుంటే గత సీజన్ నాటి పరిస్థితులే పునరావృతమవుతాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2024 / 01:01 PM IST
    Follow us on

    SRH : ఇటీవల ఢిల్లీ జట్టుపై జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఏకంగా 266 రన్స్ చేసింది.. ఓపెనర్లు హెడ్ 89, అభిషేక్ శర్మ 48 రన్స్ చేసి అదరగొట్టారు. ఆ మ్యాచ్లో ఘనవిజయం సాధించిన తర్వాత.. బెంగళూరు తో హైదరాబాద్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్లో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. 206 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు 177 రన్స్ మాత్రమే చేయగలిగింది. అయితే ఈ ఓటమిని చాలామంది దురదృష్టం కింద లెక్కేశారు..కానీ, చెన్నై జట్టుతో ఆడిన మ్యాచ్లో అయితే దారుణంగా 134 మాత్రమే చేసి హైదరాబాద్ పరువు పోగొట్టుకుంది.

    ఆదివారం రాత్రి చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో.. టాస్ గెలిచినప్పటికీ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మైదానాన్ని అంచనా వేయలేక హైదరాబాద్ కెప్టెన్ బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు.. 19 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన చెన్నై.. రెండో వికెట్ కు ఏకంగా 107 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో.. 126 రన్స్ వద్ద చెన్నై రెండో వికెట్ తీసిన హైదరాబాద్.. చెన్నై జట్టు స్కోరు 200 కు చేరుకున్న తర్వాత మూడో వికెట్ పడగొట్టింది. భువనేశ్వర్ కుమార్, కమిన్స్, జయదేవ్ వంటి వారు ఉన్నచోట.. హైదరాబాద్ కేవలం మూడంటే మూడే మాత్రమే వికెట్లు పడగొట్టింది.. 212 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన హైదరాబాద్ కేవలం 134 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. హెడ్ తేలిపోయాడు. అభిషేక్ శర్మ నిలబడలేకపోయాడు. మార్క్రం సత్తా చూపించలేకపోయాడు. క్లాసెన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఇక మిగతా వారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వాస్తవానికి హైదరాబాద్ ఈ సీజన్లో ముంబై, బెంగళూరు మీద అత్యధిక పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే మరో జట్టు కొట్టేందుకు కూడా సాహసించని పరుగులు నమోదు చేసింది. అలాంటి జట్టు వరుస రెండు మ్యాచ్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. దీనిని బట్టి హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేస్తేనే గెలుస్తుంది, భారీ స్కోరు సాధిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బెంగళూరు, చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లలో ఓపెనర్ హెడ్ విఫలమయ్యాడు. అభిషేక్ శర్మ అంతంతమాత్రంగా ఆడాడు.. క్లాసెన్ ఏదో అర్జెంట్ పని ఉందన్నట్టుగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు.. మార్క్రం ఏదో అలా ఆడిపోయాడు.. ఇక మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో హైదరాబాద్ ఆటగాళ్ల తీరు పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఫోర్ల మోత, సిక్సర్ల వర్షం కురిపించిన ఆటగాళ్లు.. నిర్లక్ష్యపు షాట్లు కొట్టి అవుట్ అవుతుండడం పట్ల నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే జట్టు ప్లే ఆఫ్ వెళ్తుందా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

    వాస్తవానికి ఈ సీజన్లో హైదరాబాద్ ఆటగాడు హెడ్, క్లాసెన్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. మార్క్రం సత్తా చూపిస్తున్నాడు. కానీ, బెంగళూరు, చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లలో వారు పూర్తిగా విఫలమయ్యారు. గల్లి స్థాయిలో ఆడి వికెట్లు వెంటనే సమర్పించుకున్నారు. అంతకుముందు ఈ రెండు జట్లతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే చెన్నై, బెంగళూరు హైదరాబాద్ తో పోల్చితే ఏమంత బలమైనవి కావు. కానీ, హైదరాబాద్ ఆ రెండు జట్ల ముందు తలవంచింది.. బౌలింగ్ విభాగంలో నిరాశపరిచింది. బ్యాటింగ్ భాగంలో అట్టడుగు స్థాయి ప్రదర్శన చేసింది. ఫలితంగా రెండు మ్యాచ్లను వరుసగా ఓడిపోయింది. ప్రస్తుతానికైతే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. వచ్చే మ్యాచ్లలో కచ్చితంగా హైదరాబాద్ గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టమవుతాయి.

    కమిన్స్, భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. జయదేవ్ వారికీ సహకారం అందిస్తున్నాడు. బ్యాటింగ్ విభాగంలో మాత్రం హైదరాబాద్ జట్టుకు స్థిరత్వం లేకుండా పోతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటేనే ఆటగాళ్లు వీరవిహారం చేస్తున్నారు. పొరపాటున చేజింగ్ కు వెళితే మాత్రం నిర్లక్ష్యపు షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకుంటున్నారు.. గత రెండు మ్యాచ్లలో హైదరాబాద్ చేజింగ్ లోనే ఓడిపోయింది. ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితి పునరావృతం కావద్దంటే ఆటగాళ్లు తమ ఆట తీరును మార్చుకోవాలి. ఒకరిద్దరి మీద మాత్రమే కాకుండా అందరూ ఆటగాళ్లు సమిష్టిగా బ్యాటింగ్ భారాన్ని మోయాలి. అప్పుడే హైదరాబాద్ ప్లే ఆఫ్ వెళ్లగలుగుతుంది. కప్ రేసులో నిలబడగలుగుతుంది. లేకుంటే గత సీజన్ నాటి పరిస్థితులే పునరావృతమవుతాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.