Vemuri Radhakrishna : ప్రతి ఆదివారం తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు శీర్షికతో వర్తమాన రాజకీయ అంశాలపై విశ్లేషణ చేస్తుంటారు ఎండి వేమూరి రాధాకృష్ణ. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన, చంద్రబాబు ప్రస్తావన అందులో లేకుంటే ఆయన చేసే విశ్లేషణ దమ్ బిర్యాని మాదిరిగా ఉంటుంది. తన పత్రికలో రాయలేని విషయాలను, అంతర్గతంగా రాజకీయాలలో సాగుతున్న విషయాలను ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా రాస్తుంటారు. ఇదే రాధాకృష్ణ జర్నలిజంలో ఉన్న బ్యూటీ.
తాజాగా ఆదివారం కొత్త పలుకు లో వేమూరి రాధాకృష్ణ చంద్రబాబు ప్రస్తావన తేలేదు. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడలేదు. ఏపీ రాజకీయాల గురించి అసలు మాట్లాడలేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఒక్క విషయం బయటకు చెప్పలేదు. మొత్తానికి మొత్తంగా తెలంగాణ బిజెపి మీద పడ్డాడు. తెలంగాణ బిజెపి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటోంది? నేతలు మొత్తం ఎవరికి వారుగా ఎందుకు మారిపోయారు? ఈ పరిస్థితికి కాయకల్ప చికిత్స అధిష్టానం ఎలా చేయాలి? ఎలా వ్యవహరిస్తే బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది? ఈ అంశాల మీద రాధాకృష్ణ తనదైన విశ్లేషణ చేశారు. ఇందులో కొన్ని విషయాలు మాత్రం డిబేటబుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా బిజెపి పెద్దలు, గులాబీ పార్టీ పెద్దలు సంప్రదింపులు జరిపిన తీరు.. అవి ఎందుకు తేడా కొట్టాయి.. బిజెపి అధిష్టానం బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడి స్థానం నుంచి ఎందుకు తొలగించింది? రేవంత్ రెడ్డికి, కెసిఆర్ కు స్థాయిలో బలమైన నాయకుడిని బిజెపి ఎందుకు తయారు చేయలేకపోతోంది? ఈ అంశాలపై రాధాకృష్ణ తనదైన శైలిలో విశ్లేషణ చేశారు.
ఇటీవల ప్రధానమంత్రి ఎన్డీఏ నాయకులతో భేటీ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించిన నరేంద్ర మోడీ.. తెలంగాణ బిజెపి పార్లమెంట్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేదని మండిపడ్డారు. చివరికి అసదుద్దీన్ ఓవైసీతో పోల్చి.. ఇలా ఎందుకు పని చేయలేకపోతున్నారని తలంటారు. సరిగ్గా అదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని రాధాకృష్ణ బిజెపి పరిస్థితి తెలంగాణలో ఎలా ఉందన్న విషయంపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. బిజెపి జాతీయ పార్టీ కాబట్టి.. తెలంగాణలో పరిస్థితి బాగోలేదని రాధాకృష్ణ రాశారు. అలాంటప్పుడు తెలుగుదేశం కూడా జాతీయ పార్టీ కదా.. ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది కదా.. తెలంగాణలో నామరూపాలు లేకుండా పోయింది కదా.. అలాంటప్పుడు తెలుగుదేశం గురించి రాధాకృష్ణ ఇలా రాయగలరా? అందులో ఉన్న లోటుపాట్ల గురించి ఇలా బయట పెట్టగలరా? నో నెవ్వర్! రాధాకృష్ణ జర్నలిజంలో ప్రశ్నించడం అనేది అతి పెద్ద బ్యూటీ. కానీ టిడిపి విషయానికి వచ్చేసరికి తిరగబడుతుంది.