Y S Jagan Mohan Reddy : షర్మిల ( Y S Sharmila) విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె ఎప్పుడైతే తనపై రాజకీయ ప్రత్యర్థిగా మారారో.. అప్పటినుంచి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇదే విషయాన్ని తాజాగా న్యాయస్థానానికి సైతం చెప్పుకొచ్చారు. వారి ఆస్తులకు సంబంధించిన వివాదం పరిశ్రమల లాబోర్డు కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరులోని కోర్టుకు తమ కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివరాలను సమర్పించారు. తాను కష్టపడి సంపాదించుకున్న ఆదాయంతో పాటు ఆస్తులను ప్రేమతో చెల్లెలు షర్మిలకు ఇవ్వాలని భావించానని.. కానీ ఆమె తనపై రాజకీయంగా కత్తులు నూరుతుంటే ఎలా ఇవ్వగలనని.. అందుకే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. షర్మిల విషయంలో తన అభిప్రాయం మారదని తేల్చి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులు ఆ ఇద్దరినీ కలుపుతారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా జగన్ కోర్టుకు నివేదించడంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
* కుటుంబ వివాదాలతోనే దూరం..
కేవలం కుటుంబ పరమైన వివాదాలతోనే జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) షర్మిల దూరమయ్యారు. ఈ క్రమంలో తనకు ఒక రాజకీయ వేదిక కావాలని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందే తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు కానీ ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. తిరిగి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ బాధ్యతలను అందుకున్నారు. అయితే ఆస్తులపరమైన వివాదాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తనను లెక్కచేయకపోవడాన్ని సహించుకోలేకపోయారు షర్మిల. అందుకే రాజకీయ మద్దతు అవసరం అని భావించి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారు.
* కలిపే ప్రయత్నం జరిగినా..
జగన్మోహన్ రెడ్డి తో పాటు షర్మిల సైతం రాజకీయంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ( Congress Party) పరిస్థితి సైతం రోజురోజుకు దిగజారుతోంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని.. దాని ద్వారా రాజకీయ ప్రత్యర్థులు బలపడతారే కానీ.. మీకు వచ్చే ప్రయోజనం ఉండదంటూ రాజశేఖర్ రెడ్డి కుటుంబ అభిమానులు హితబోధ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య సంధి కుదిరినట్లు టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ కనిపించడం లేదు. తాజాగా ఆస్తుల వ్యవహారం పై కోర్టులో జగన్మోహన్ రెడ్డి పొందుపరిచిన అంశాలు చూస్తుంటే మాత్రం షర్మిల విషయంలో జగన్ అభిప్రాయం మారదు అంటే మారదు అన్నట్టు ఉంది.