https://oktelugu.com/

Acb Raids: మున్సిపల్ సూపరింటెండెంటే ఇన్ని కోట్లు తింటే.. ఇక మిగతా వాళ్ల పరిస్థితేంది?

లంచం అనే మహమ్మారి సమాజాన్ని పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వడం అనేది పరిపాటిగా మారింది. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు.. ప్రతి పనికి లంచం అనేది సర్వసాధారణమైపోయింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 9, 2024 / 08:39 PM IST

    Acb Raids

    Follow us on

    Acb Raids: కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు.. వాటిని లెక్కించేందుకు యంత్రాలు.. అవి లెక్కించినా ఒక పట్టానా లెక్క అంతు పట్టలేదు. ఆ నగదే అలా ఉందనుకుంటే.. దానికి బంగారం తోడైంది. ఒక్కో నెక్లెస్ ఒక్కో తీరుగా ఉంది. ఆ డిజైన్లు చూస్తుంటే అధికారులకు మతి పోయినంత పనయింది. ఇలా బంగారం, నగదు మొత్తం గా లెక్కిస్తే ఏసీబీ అధికారులకు దాదాపు మూర్చ వచ్చినంత పనైంది.. ఉదయం నుంచి మొదలుపెడితే సాయంత్రం పొద్దుపోయేదాకా లెక్కిస్తే గాని ఆ సొమ్ము అంచనా ఎంత అనేది అర్థం కాలేదు. విడతల వారీగా అధికారులు లెక్కించిన తర్వాత.. ఆ సొమ్ము విలువ ఎంతో తేలింది.. ఇంతకీ ఆ సొమ్ము ఏదో మద్యం షాపుల టెండర్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చింది కాదు.. విలువైన భూముల అమ్మకం ద్వారా వచ్చింది అంతకన్నా కాదు.. ఇంతకీ ఆ డబ్బు, ఆ బంగారం ఎక్కడ దొరికాయి? ఎందుకు అధికారులు ఆ స్థాయిలో తీవ్రంగా శ్రమించి లెక్క పెట్టారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

    లంచం అనే మహమ్మారి సమాజాన్ని పట్టిపీడిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వడం అనేది పరిపాటిగా మారింది. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు.. ప్రతి పనికి లంచం అనేది సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్ శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏసీబీకి విస్తృత అధికారాలు ఇవ్వడంతో ఆ శాఖకు చేతినిండా పని దొరికింది. దీంతో ప్రతిరోజు ఏదో ఒక అధికారిని వారు పట్టుకుంటున్నారు. ఆ పట్టుకుంటున్న సమయంలో భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఏసీబీ చరిత్రలో తొలిసారిగా భారీగా నగదు చేసుకొని.. అధికారిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థలో అవినీతి తారాస్థాయికి చేరిందని ఏసీబీ అధికారులకు ఇటీవల వరుసగా ఫిర్యాదులందాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా సమాచారాన్ని సేకరించిన ఏసీబీ అధికారులు శుక్రవారం రంగంలోకి దిగారు. నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నరేందర్ నివాసం పై ఏసీబీ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేశారు.

    దాదాపు పదిమంది అధికారుల బృందం శుక్రవారం ఉదయం నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నివాసంలోకి చేరుకున్నారు. అనంతరం నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. వారి భద్రత మధ్య నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నివాసం లో సోదాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికారుల సోదాల్లో నరేందర్ ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఈ తనిఖీలలో భారీగా నగదు లభ్యమైంది. నరేందర్ ఇంట్లో 2.93 కోట్ల నగదు, రూ 1.10 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ను గుర్తించారు. 1.10 కోట్ల నగదు బ్యాలెన్స్ నరేందర్, అతడి భార్య, అతడి తల్లి ఖాతాలో ఉన్నాయి. నగదు మాత్రమే కాకుండా 51 తులాల బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా 17 ప్రాంతాలలో స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించారు. బహిరంగ మార్కెట్ ప్రకారం వాటి విలువ 1.98 కోట్లు ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. ఇప్పటివరకు మొత్తం 6.07 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు. అనంతరం నరేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ నిమిత్తం ఏసిబి కోర్టుకు తరలించారు.

    ఇక నిజామాబాద్ నగరపాలకంలో నరేందర్ చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. పైసలు ఇస్తేనే పనిచేస్తాడని అపవాదు అతనిపై ఉంది. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ పెద్దల అండదండలతో అతడు రెచ్చిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతడు మాత్రమే కాకుండా, ఇతడి పై ఉన్న అధికారులు సైతం లంచావతారులేనని తెలుస్తోంది. అయితే వారిపై కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో.. త్వరలోనే వారిపై కూడా దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏసీబీ చరిత్రలో రెవెన్యూ అధికారుల వద్దనే భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. కానీ తొలిసారిగా పురపాలక శాఖకు చెందిన ఒక కీలక అధికారుల నుంచి ఈ స్థాయిలో ఆస్తులు స్వాధీనం చేసుకోవడం.. ఇదే తొలిసారి.