https://oktelugu.com/

CM Revanth Reddy : రేవంత్.. నువ్వు చేసేది తప్పు.. ఆర్కే కూడా వద్దంటున్నాడే?

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో.. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంలో ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ పోషించిన పాత్ర ఎటువంటిదో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంతకుముందు పలుమార్లు కూడా రాధాకృష్ణ రేవంత్ రెడ్డితో ముఖాముఖి నిర్వహించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 29, 2024 / 06:57 PM IST

    CM Revanth Redyy

    Follow us on

    CM Revanth Reddy :  రాధాకృష్ణతో రేవంత్ రెడ్డి అనుబంధం ఇవాల్టిది కాదు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కొడంగల్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు.. ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది అంటారు. దానిని తర్వాత స్థాయికి తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారని.. పైగా అప్పట్లో కెసిఆర్ ను నిలదీయడంలో రేవంత్ పోషించిన పాత్ర నచ్చి.. రాధాకృష్ణ అండగా నిలిచారని అంటుంటారు. అందువల్లే రేవంత్ రెడ్డికి ఆంధ్రజ్యోతిలో విశేషమైన కవరేజ్ లభిస్తుంది. అంతటి ఓటుకు నోటు కేసులోనూ రేవంత్ తప్పు ఏదీ లేదన్నట్టుగానే ఆంధ్రజ్యోతి అప్పట్లో వార్తలు రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డిని ఆంధ్రజ్యోతి కాపాడిన సందర్భాలు అనేకం. ఇక ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం తరఫునుంచి ఆంధ్రజ్యోతికి భారీగానే జాకెట్ యాడ్స్ వస్తున్నాయి. గత కెసిఆర్ హయాంలో ఆంధ్రజ్యోతికి పెద్దగా ప్రకటనలు రాలేదు. అయితే అన్ని సంవత్సరాల కరువును ఆంధ్రజ్యోతి ఇప్పుడిప్పుడే తీర్చుకుంటున్నది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సానుకూల కథనాలనే ఆంధ్రజ్యోతి ప్రచురిస్తోంది. అయితే తొలిసారిగా రేవంత్ రెడ్డిని ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఎడిషన్ మొదటి పేజీలో ఇందుకు సంబంధించి రాధాకృష్ణ తన కొత్త పలుకు రాశారు. హైడ్రా దూకుడు తగ్గించాలని.. కూల్చివేతలను నిలిపివేయాలని సూటిగా చెప్పేశారు. లేకపోతే కూల్చివేతల ప్రభుత్వంగా స్థిరపడిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పెద్ద పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్ లు కూల్చి వేసినప్పుడు వ్యతిరేకత వచ్చినప్పటికీ.. మూసీ నదిని ఆక్రమించి నిర్మించుకున్న వారి ఇళ్లను ప్రభుత్వం కూలగొడుతున్నప్పుడు మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు. ఈ దశలోనే భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పై కూల్చివేతల ప్రభుత్వం అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోందని.. ఎందుకైనా మంచిది దాని నుంచి జాగ్రత్త పడాలని రాధాకృష్ణ సలహా ఇచ్చారు..

    గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయిందని, పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లు వచ్చాయని.. ఆయనప్పటికీ ఆ పార్టీని బలోపేతం చేసేందుకు హరీష్ రావు, కేటీఆర్ విష ప్రయత్నాలు చేస్తున్నారని రాధాకృష్ణ అన్నారు.. బిజెపి యాక్టివ్ గా లేకపోవడంతో.. భారత రాష్ట్ర సమితి నేతల్లో సానుకూల దృక్పథం పెరిగిందని.. అందువల్లే ఇటీవల కాలంలో వలసలు తగ్గాయని చెబుతున్నారు.. ఫామ్ హౌస్ లో కెసిఆర్ ఖాళీగా ఉన్నాడని రేవంత్ భావిస్తే అది ప్రమాదమని.. ఆయన అక్కడ కూర్చొని తన బుర్రకు పదును పెడుతున్నారని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇదే క్రమంలో రేవంత్ చేస్తున్న తప్పులను రాధాకృష్ణ వివరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ వాడిన భాష జనామోదంగా ఉందని.. ముఖ్యమంత్రిగా ఆ భాషను వాడితే ప్రజలు ఒప్పుకోరని రాధాకృష్ణ చెప్పారు. రేవంత్ రెడ్డికి కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ నుంచి అనేక ప్రతిబంధకాలు ఉన్నాయని.. అలాంటప్పుడు రేవంత్ జాగ్రత్తగా అడుగులు వేయాలని రాధాకృష్ణ సూచించారు. హై కమాండ్ చేస్తున్న రాజకీయం వల్ల పార్టీపై రేవంత్ రెడ్డికి పట్టు చిక్కడం లేదని.. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలని రాధాకృష్ణ సలహా ఇచ్చారు. అయితే కెసిఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోకుండా ఉండాలని ఆర్కే రేవంత్ రెడ్డికి సూచించడం ఈ వారం కొత్త పలుకులు హైలెట్ గా నిలిచింది. రాజకీయ అవినీతిని ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదని రాధాకృష్ణ తేల్చేశారు. ఒకవేళ కాలేశ్వరంలో అవినీతి జరిగిందని నిరూపించినా కెసిఆర్ కు ఏమీ కాదని రాధాకృష్ణ స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు ను టార్గెట్ చేస్తూ రేవంత్ నిర్ణయాలు తీసుకుంటే.. అవి వాళ్లను మరింత బలవంతులుగా మార్చుతాయని రాధాకృష్ణ అన్నారు. ఇలాంటి క్రమంలోనే నింపాదిగా వ్యవహరించాలని.. జాగ్రత్తగా అడుగులు వేయాలని రాధాకృష్ణ రేవంత్కు సూచించారు. రాధాకృష్ణ గతంలో కెసిఆర్ పై నిప్పులు చిమ్మే విధంగా రాతలు రాసేవాడు. కానీ హఠాత్తుగా బూస్టప్ కథనం రాయడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే బావా బామ్మర్దుల మధ్య స్నేహం మళ్లీ మొదలైందా?! ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి.