IPL 2025 Megha Auction : ప్రతి జట్టు పర్సు వేల్యూ ఈసారి 120 కోట్లకు పెరిగింది.. ఇక ఆటగాళ్లందరికీ ప్రతి మ్యాచ్ లో 7.50 లక్షల ఫీజు చెల్లిస్తామని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ జట్టుతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది ఆదనం. అన్ని లీగ్ మ్యాచ్ లు ఆడితే ఒక్కో ఆటగాడికి అదనంగా 1.05 కోట్ల ఆదాయం దక్కుతుంది. వేతనాల కోసం ప్రతి జట్టు 12.60 కోట్లు ఖర్చు చేయాలి. పర్సు విలువకు ఇది అదనం… ఇక ఆయా జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు 18, 14, 11 కోట్లను చెల్లించాలి. ఒకవేళ అయిదుగురు ఆటగాళ్లను రిటైన్ కనక చేసుకుంటే 45 కోట్లు మాత్రమే యాజమాన్యాల వద్ద మిగులుతాయి. ఈ డబ్బుతోనే ఆర్టీఎం తో పాటు 15 మంది ఆటగాళ్లను చేయాల్సి ఉంటుంది. అయితే గత సీజన్ లో విదేశీ ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోట్లను కొల్లగొట్టారు. ఈ క్రమంలో అలాంటి వారికి చెక్ పెట్టేందుకు బీసీసీఐ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
విదేశీ ఆటగాళ్ల విషయంలో..
ఇక విదేశీ ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. వేలంలో ఆటగాడిని కోరుకున్న తర్వాత.. సీజన్ ప్రారంభంలో అందుబాటులో ఉండబోనని చెబితే అతడిపై రెండు సంవత్సరాలపాటు నిషేధం ఉంటుంది. ఒకవేళ గాయాల బారిన పడితే ఆటగాళ్లకు మినహాయింపు ఉంటుంది. ఇక గత సీజన్లో స్టార్క్, కమిన్స్ లాంటి ఆటగాళ్లు భారీగా ఆదాయాన్ని పొందారు. రికార్డు స్థాయిలో డబ్బుకు అమ్ముడుపోయారు. అయితే ఈసారి విదేశీ ఆటగాళ్లు ఎక్కువ డబ్బులు సంపాదించకుండా బీసీసీఐ నిబంధనలను విధించింది. ఐపీఎల్ 2025లో భారత ఆటగాడు అత్యధికంగా 18 కోట్లకు పలికితే.. ఐపీఎల్ 2026 మినీ వేలంలో విదేశీ ఆటగాళ్లు అంతకంటే ఎక్కువ ధర దక్కించుకున్నప్పటికీ.. వారికి 18 కోట్లు మాత్రమే లభిస్తాయి. అయితే ఆ పైఎత్తున ఉండే డబ్బును బీసీసీఐ తిరిగి తీసుకుంటుంది. దానిని ఆటగాళ్ల సంక్షేమం కోసం ఖర్చు చేస్తుంది.. అయితే ఎక్కువ ధర కోసం విదేశీ ఆటగాళ్లలో కొంతమంది మినీ వేలంలోకి వస్తున్నారు. వారు మెగా వేలంలో పాల్గొనడం లేదు. అందువల్లే బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2025 లో ఒక భారతీయ ఆటగాడు 18 కోట్లు పలికాడు అనుకుంటే.. 2026 మినీ వేలంలో విదేశీ ఆటగాడు 25 కోట్ల ధర పలికినా అతడికి బీసీసీఐ 18 కోట్లు మాత్రమే ఇస్తుంది. మిగతా ఏడు కోట్లను ఆటగాళ్ల సంక్షేమం కోసం వెచ్చిస్తుంది.. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు మినీ వేలంలో భారీగా ధర పలుకుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.