https://oktelugu.com/

Jeevan Reddy: ఉపాధి కూలీ చెంప చెళ్లుమనిపించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్, చేపూర్, పిప్రీ గ్రామాలలో ప్రచార నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి ఉన్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 4, 2024 / 06:33 PM IST

    Jeevan Reddy

    Follow us on

    Jeevan Reddy: దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారం వచ్చి నాలుగు నెలలు కాకముందే.. పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఈ తరుణంలో గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులపై ఉంది. అలాంటి సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ, ఓ అధికార పార్టీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి దురుసుగా వ్యవహరించారు. ప్రచారంలో భాగంగా ఓ మహిళా కూలి చెంప చెల్లుమనిపించారు.

    నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్, చేపూర్, పిప్రీ గ్రామాలలో ప్రచార నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఓ గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్న చోటుకు జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి కలిసి వెళ్లారు.. అక్కడ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు వినయ్ రెడ్డిని ఉద్దేశించి.. “గడిచిన ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసిన” అని చెప్పింది.. అప్పటికే జీవన్ రెడ్డి ఆమె చెంప తడుతున్నారు. ఎప్పుడైతే ఆమె కమలం గుర్తుకు ఓటేశానని చెప్పిందో అప్పుడు ఒక్కసారి గా చెల్లుమనిపించారు. ఆ పరిణామానికి ఆ మహిళా కూలి ఒక్కసారిగా విస్తు పోయింది. దీంతో వెంటనే తేరుకుంది. ” నాకు పెన్షన్ వస్తలేదు. ఈసారి ఇప్పించండి సారూ” అంటూ చేతులు జోడించి వేడుకొంది.. ఆమె అన్న ఆ మాటకు వినయ్ రెడ్డి స్పందించారు. “వెళ్లి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని అడుగు పో” అంటూ విసుగ్గా చెప్పారు.

    సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ అభ్యర్థి ఇలాంటి చర్యకు పాల్పడటంతో.. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి నాయకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తున్నారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కండకావరం పెరిగిందని విమర్శిస్తున్నారు. ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్తారని అంటున్నారు. ప్రతిపక్ష పార్టీకి ఓటు వేశానని చెప్తే, ఉపాధి కూలీ చెంప పై దెబ్బకొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని.. వారు ఓటు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చారని.. ఆ విషయం మర్చిపోతే ఎలా అని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతవరకు స్పందించలేదు.