HomeతెలంగాణKomuravelli Mallanna Swamy: కొమురవెల్లి మల్లన్న స్వామి.. ఇంటి దొంగల నుంచి నిన్ను నువ్వే కాపాడుకోవయ్యా

Komuravelli Mallanna Swamy: కొమురవెల్లి మల్లన్న స్వామి.. ఇంటి దొంగల నుంచి నిన్ను నువ్వే కాపాడుకోవయ్యా

Komuravelli Mallanna Swamy: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టు కోలేడు అంటారు. ఈ లోకోక్తి వెనుక బలమైన కారణమే ఉంది. సామాన్యుల ఇళ్లల్లో సొంతవారే దొంగలుగా మారినప్పుడు . సాక్షాత్తు శివుడికే వచ్చింది. దీంతో ఇంటి దొంగల నుంచి ఆయనను ఆయనే కాపాడుకోవాలని భక్తులు విన్నవించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలలో జనగామ జిల్లా కొమురవెల్లి ఒకటి. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది.

ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి ఇంటి దొంగల బెడద కొంతకాలంగా ఇబ్బంది పెడుతోంది. స్వామి ఆస్తుల విషయంలో.. భక్తుల నుంచి లభించే కానుకల విషయంలో రక్షణ పూర్తిగా కొరవడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామివారికి భక్తులు సమర్పించే హుండీ ఆదాయంలో వరుసగా చోరీ సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనేక రకాల అనుమానాలకు కారణమవుతున్నాయి.

మల్లన్న స్వామి హుండీ ఆదాయాన్ని లెక్కించే విషయంలో ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదు. హుండీ ఆదాయాన్ని లెక్కించడానికి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనేవారు కచ్చితంగా పంచలు కట్టుకోవాలి. ఒంటిమీద ఎటువంటి ఆభరణాలు వేసుకోవద్దు. ధర్మకర్తలు.. ఆలయ సిబ్బందిపై నిత్యం నిఘా ఉండాలి. కానీ, అటువంటివి ఇక్కడ జరగడం లేదు.

2016లో డిసెంబర్ 27న హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న క్రమంలో కరీంనగర్ జిల్లా కేంద్రాలు చెందిన ఒక మహిళ 9,500 రూపాయలను తస్కరించింది. పోలీసులు పరిశీలించగా ఈ వ్యవహారం బయటపడింది.

2017 మార్చి 30న హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న క్రమంలో ఓ మహిళ బంగారం, వెండి దొంగతనం చేసింది.

2017 జనవరి 4న కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక మహిళ తన ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు.. ఇతర నగదు మొత్తాన్ని హుండీలో వేసింది. హుండీలో ఆమె తులాలకు పైగా పుస్తెలతాడు, చెవి కమ్మలు, ముక్కు పుడక, నగదు ఉంది. ఫిబ్రవరి 2న హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నప్పుడు ఆ భక్తురాలు పుస్తెలతాడు కనిపించలేదు. ఆ సంఘటన ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.

1994లో స్వామివారి గర్వాలయంలో మూడు హుండీలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు.

2009 నుంచి 2010 వరకు జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో ఓ పూజారి బంగారాన్ని నోట్లో వేసుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో పోలీసులు అతడిని గుర్తించి ఆలయ సిబ్బందికి అప్పగించారు. విచారణ నిర్వహించి అతడిని సస్పెండ్ చేశారు.

2010 అక్టోబర్లో ధర్మకర్త విదేశాలకు సంబంధించిన కాయిన్స్ ను దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు

2018 లో జనవరి నెలలో హుండీ ఆదాయాన్ని బ్యాంకుకు తరలిస్తుండగా ఓ ఆటో డ్రైవర్ తన హస్త లాఘవాన్ని ప్రదర్శించాడు.

ఆలయంలో పారిశుధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న శాంతమ్మ అనే మహిళ 5.77 గ్రాముల బంగారం, 5.26 గ్రాముల వెండి బిస్కెట్ ను దొంగతనం చేసింది. ఈ సంఘటన 2018 మార్చి 30న జరిగింది. ఈ క్రమంలో ఆమెను గుర్తించిన ఆలయ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక మహిళ 2000 నగదు అపహరిస్తూ దొరికిపోయింది. 2018 జూలై 20న ఈ సంఘటన జరిగింది.

ఆలయంలో 2018 అక్టోబర్ 1న బంగారు ఆభరణం మాయమైంది. అప్పట్లో ఈ సంఘటన గందరగోళానికి కారణమైంది.

2024 లో స్వామివారికి భక్తుల ద్వారా లభించిన కానుకలలో ఒక బంగారు గొలుసు మాయమైందని తేలింది. ఆ తర్వాత ఆ గొలుసు చెత్త కుప్పలో దొరికింది. విచారణ నిర్వహిస్తే దీని వెనక ఓ అధికారి ఉన్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

ఇక ఫిబ్రవరి 12, 2026న ఓ ఆలయ ఉద్యోగి హుండీ లెక్కింపులో 9000 తీసుకెళ్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. ఆ విషయాన్ని వారు ధర్మకర్తల దృష్టికి తీసుకెళ్లగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular