Love Couple Tragedy: ప్రేమలో ఉన్నప్పుడు లోకం కనిపించదు. ఆ ప్రేమ మాయమైతే అన్ని తప్పులే కనిపిస్తాయి. ఈ ప్రేమ జంటకు అలాంటి అనుభవం ఎదురయింది. అది ఏకంగా వారిద్దరి జీవితాలను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసింది. చిలకా గోరింకలా మాదిరిగా సందడిగా తిరగాల్సిన వారిద్దరు.. కఠినమైన నిర్ణయం తీసుకొన్నారు. కన్నవాళ్లకు, బంధువులకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చారు.
ప్రేమలో పడడం తప్పు కాదు. ప్రేమించిన వారితో జీవితాన్ని పంచుకోవడం కూడా తప్పుకాదు. కాకపోతే ఆ జీవితాన్ని జీవించే క్రమంలో ఎదురయ్యే పాటు పోట్లను ఆనందంగా భరించాలి. వాటిని జీవితానికి అనుకూలంగా మార్చుకోవాలి. అంతే తప్ప చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడకూడదు. భావోద్వేగాలను రెచ్చగొట్టుకోకూడదు. చివరికి ఎదుటి మనిషి మీద అకారణంగా ఆగ్రహాన్ని ప్రదర్శించకూడదు. దానివల్ల లేనిపోని మాటలు వస్తుంటాయి. కోపంలో మాటలు దొర్లుతుంటాయి. అవి ఎదుటి మనిషి పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అంతిమంగా జరగకూడని దారుణానికి కారణమవుతుంటాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా.. సరిగ్గా 15 రోజుల వ్యవధి లోనే అటు భార్య.. ఇటు భర్త చనిపోవడం ఆ రెండు కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తోంది.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రదండి ప్రాంతానికి చెందిన అల్లిపు సంతోష్, గంగోత్రి ప్రేమించుకున్నారు. నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. సెప్టెంబర్ 26న వివాహం చేసుకున్నారు. ఈనెల దసరా రోజు భార్యతో కలిసి సంతోష్ అత్తింటికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే గంగోత్రి మటన్ వండింది. అందులో కాస్త కారం ఎక్కువ కావడంతో భార్యను సంతోష్ మందలించాడు. భర్త మందలించిన తీరును తట్టుకోలేక గంగోత్రి తీవ్ర ఆవేదనకు గురైంది. ఇంట్లో గొడవ కావడంతో అదే రోజు సాయంత్రం సంతోష్ తన భార్యను తీసుకుని సొంత ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా కూరలో కారం గురించి మళ్ళీ గొడవ మొదలైంది. ఈసారి గంగోత్రి మరింత మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
వివాహం జరిగిన వారం వ్యవధిలోనే భార్య చనిపోవడంతో ఆవేదనకు గురయ్యాడు. అప్పట్నుంచి తీవ్ర విచారంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో సరిగ్గా వారం క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే తన అక్క దగ్గరికి వెళ్ళాడు.. అక్కడ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సరిగ్గా దసరా నాడు భార్య ఆత్మహత్య చేసుకుంటే.. దీపావళి నాడు భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. అంతేకాదు నేటి కాలంలో యువత మధ్య భావోద్వేగాలు ఎలా ఉంటున్నాయి.. అవి ఎంతటి దారుణానికి దారితీస్తున్నాయో నిరూపిస్తున్నాయి.