Tuni Minor Girl Incident Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో తుని ప్రాంతంలో గురుకుల పాఠశాలలో చదువుతున్న ఎనిమిదవ తరగతి బాలికపై నారాయణరావు అనే వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఇంతలోనే సపోటా తోట యజమాని రావడంతో అతని ప్రయత్నం విఫలమైంది. పైగా ఈ ఘటనకు సంబంధించి సపోటా యజమాని తీసిన వీడియో మీడియాలో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే నారాయణరావు పై ఫోక్సో కేసు నమోదు చేసింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మరో వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారించారు. సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడంతో వారు వెంటనే నారాయణరావును పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.
ఎనిమిదో తరగతి బాలికపై దారుణం చేసేందుకు ప్రయత్నించగా నారాయణరావు దుర్మార్గాన్ని పసిగట్టిన సపోటా తోట యజమాని అప్రమత్తమయ్యాడు. ఈ వ్యవహార మొత్తాన్ని వీడియో తీసి.. నారాయణరావును ప్రశ్నించాడు. దీంతో నారాయణరావు భయపడి.. అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియా ద్వారా బయటికి రావడంతో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. నారాయణరావును అదుపులోకి తీసుకుంది. బాలికకు ధైర్యం చెప్పి.. అండగా ఉంటామని మాట ఇచ్చింది. అంతేకాదు జరిగిన ఘటనపై ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకులను విచారించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
నారాయణ రావు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వం.. అతడిని వెంటనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచేందుకు తీసుకెళ్ళింది. ఈ క్రమంలో అర్ధరాత్రి పూట నారాయణరావు మూత్ర విసర్జన కోసం వెళ్తానని పోలీసుల అనుమతి కోరాడు. దీంతో పోలీసులు కోమటి చెరువు ప్రాంతం వద్ద వాహనాన్ని ఆపారు. దీంతో నారాయణరావు చెరువులోకి దూకాడు. ప్రస్తుతం అతడి కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మూత్ర విసర్జన కోసం వెళ్ళిన నారాయణరావు ఎంతసేపటికి రాకపోవడంతో.. పోలీసులకు అనుమానం వచ్చి గాలించారు. అతడు పరుగు పరుగున వెళ్లి చెరువులో దూకాడు. పోలీసులు ఎంత చెబుతున్నప్పటికీ అతడు ఆగలేదు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు అతడి ఆచూకీ లభించలేదు.. అయితే ఈ ఘటన ఏపీలో మరో కీలక పరిణామానికి దారి తీసింది. నారాయణ రావు టిడిపికి చెందిన వ్యక్తి అని.. కౌన్సిలర్ గా కూడా పని చేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి దారుణం జరిగిన సందర్భంలో పార్టీ పేరు ప్రస్తావించడం ఎంతవరకు సబబు అని టిడిపి నేతలు అంటున్నారు.