Peddapalli: శ్మశానంలో అస్థికలు ఎత్తుకెళ్తున్నారు.. ఇదోరకం దందా!

పుర్రెలు, ఎముకలతో ఏం చేస్తారు.. అది కూడా శ్మశానికి వెళ్లి.. దహనం అయిన శవాల బూడిదలో ఏరుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది. కారణం తెలియదుకానీ, పెద్దపల్లి జిల్లాలో ఓ ముఠా శ్మశానంలో అస్థికలను ఎత్తుకెళ్తోంది.

Written By: Raj Shekar, Updated On : February 18, 2024 9:51 am
Follow us on

Peddapalli: శ్మశానాల్లో బొగ్గులు ఎత్తుకెళ్లేవారిని చూశాం. ఇలా ఎత్తుకెళ్లిన బొగ్గులను మొక్కజొన్న పొత్తులు కాల్చడానికి, బంగారం దుకాణాల్లో బంగారం కరిగించేందుకు, లాండ్రీ షాపుల్లో బట్టలు ఇస్త్రీ చేసేవారికి విక్రయిస్తారు. ఇది సాధారణంగా జరిగేదే. కానీ శ్మశానంలో ఓ ముఠా అస్థికలు అపహరిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా శవాలు కాలిన తర్వాత మిగిలిన ఎముకలను ఏరి ఓ సంచిలో వేసుకుని తీసుకుపోతున్నారు.

పెద్దపల్లి జిల్లాలో ముఠా..
పుర్రెలు, ఎముకలతో ఏం చేస్తారు.. అది కూడా శ్మశానికి వెళ్లి.. దహనం అయిన శవాల బూడిదలో ఏరుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంటుంది. కారణం తెలియదుకానీ, పెద్దపల్లి జిల్లాలో ఓ ముఠా శ్మశానంలో అస్థికలను ఎత్తుకెళ్తోంది. శ్మశానాల్లో మంత్రాలు, పూజలు,
చేతబడులు చేయడం కామన్‌.. ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఈ ముఠా కేవలం కాలిన శవాల ఎముకలు ఎత్తుకెళ్లడం ఇప్పుడు జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

రెండు రోజుల్లో నలుగురు పట్టివేత..
సుల్తానాబాద్‌లో రెండు రోజుల వ్యవధిలో నలుగురు ఎముకల దొంగలను స్థానికులు పట్టుకున్నారు. వైకుంఠధామాల్లో దహనం అయిన శవాల ఎముకలు పోగు చేసుకుంటున్నారు. వాటిని ఒక సంచిలో వేసుకుని తీసుకెళ్తున్నారు. ఫిబ్రవరి 16న ఇద్దరు యువకులు ఇలా ఎముకలు ఎత్తుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఏం చేస్తారని అడిగినా వాళ్లు సమాధానం చెపపలేదు. దీంతో వాళ్లను బెదిరించి వెళ్లగొట్టారు. ఇక ఫిబ్రవరి 17న ఇద్దరు మహిళలు కూడా ఇలాగే ఎముకలు ఏరుకుని వెళ్తుండగా మున్సిపల్‌ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అస్థికలు మాయం అవుతుండడంతో..
కొన్ని రోజులుగా సుల్తానాబాద్‌ వైకుంఠధామంలో దహనం చేసిన శవాల అస్థికలు మాయమవుతున్నాయి. అయితే మొదట కొందరు పూర్తిగా కాలి బూడిదయ్యాయని భావించారు. కానీ తర్వాత ఎముకలను ఎవరో ఎత్తుకెళ్తున్నట్లు అనుమానించారు. ఈమేరకు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా పెట్టిన మున్సిపల్‌ సిబ్బంది వరుసగా రెండు రోజుల వ్యవధిలో నలుగురిని పట్టుకున్నారు. అయితే ఇలా ఎత్తుకెళ్లిన ఎముకలను ఏం చేస్తారో తెలియడం లేదు. పట్టుపడిన వారు నోరు విప్పడం లేదు.

విచారణ జరుపుతున్న పోలీసులు..
రెండురోజుల వ్యవధిలో నలుగురు పట్టుపడడంతో మున్సిపల్‌ సిబ్బంది అస్థికల దొంగలను పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎత్తుకెళ్లిన అస్థికలను ఏం చేస్తారని ఆరా తీస్తున్నారు. ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చింది.. ఎన్ని రోజులుగా జిల్లాలో తిరుగుతోంది.. ఎక్కడెక్కడ అస్థికలు ఎత్తుకెళ్లారు.. వాటిని ఏం చేస్తారు అని ఆరా తీస్తున్నారు.