HomeతెలంగాణBalagam: బలగం సినిమా ఎంత పని చేసింది

Balagam: బలగం సినిమా ఎంత పని చేసింది

Balagam: మన దేశంలో కుటుంబ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలతో ఊళ్లు కళకళలాడేవి.అయితే మారుతున్న అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి కుటుంబం విఛ్చిన్నమైంది. బంధాలు, బంధుత్వాల మధ్య అడ్డుగోడలు మొదలయ్యాయి. అపార్థాలతో గొడవలు రాజ్యమేలయ్యాయి. దీంతో పరువు, ప్రతిష్ట అంటూ గిరి గీసుకుపోయారు. పగలు, ప్రతీకారాలతో రగిలిపోయారు. కయ్యానికి కాలు దువ్వుతూ మనశ్శాంతిని దూరం చేసుకున్నారు. ప్రాథమిక కుటుంబం ఏర్పడ్డాక కూడా ఎవ్వరికీ పొసగడం లేదు. అన్నదమ్ములు, అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య సంబంధాలు తెగిపోయాయి. అయితే ఇటీవల వచ్చిన బలగం సినిమా అనేక మందిని ప్రభావితం చేసింది. బంధాలు, బంధుత్వంపై తీసిన ఈ సినిమాను చూసిన.. చాలా మంది.. పగలు మర్చిపోయి తోబుట్టువులతో మాట్లాడుతున్నారు. తాజాగా 156 మంది సభ్యులు ఉన్న పెద్ద కుటుంబం ఈ సినిమా స్పూర్తితో కలిసిపోయారు.

పెద్దపల్లి జిల్లాలో పే..ద్ద కుటుంబం..
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన ఇరగోని మల్లయ్య – ఆగవ్వ దంపతులది పెద్ద కుటుంబం. కానీ మనస్పర్థల కారణంగా ఏళ్ల క్రితమే విడిపోయి.. ఎవరికి వారే జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొందరు బలగం సినిమాను చూశారు. కుటుంబ విలువలు, అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే ఈ చిత్రాన్ని చూసిన తర్వాత వారిలో చలనం వచ్చింది.

కుటుంబాన్ని ఏకం చేయాలని..
ఏళ్ల క్రితం విడిపోయిన తమ కుటుంబాన్ని ఏకం చేయాలనుకున్నారు. వేర్వేరు ప్రాంతాలకు వలసవెళ్లి స్థిరపడిన వాళ్లందరినీ ఒక్కచోట చేర్చే ప్రయత్నం చేశారు. అందర్నీ ఒప్పించి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జూన్‌ 11 (ఆదివారం) గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇరగోని మల్లయ్య-ఆగవ్వ కొడుకులు- కోడళ్లు, కూతుళ్లు- అల్లుళ్లు, మనమళ్లు-మనమరాళ్లు దాదాపు 156 మంది ఒక్కచోట చేరారు. ఆటపాటలు, మాట ముచ్చటలతో రోజంతా సరదాగా గడిపారు. పెద్దలను సన్మానించి గౌరవించుకున్నారు.

ఇటీవల కలిసిన దాయాదులు..
15 సంవత్సరాలుగా పగతో ప్రతీకారాలతో రగిలి పోయిన ఎనిమిది మంది కుటుంబాలను ఇటీవల బలగం సినిమా కలిపింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మండలం మాసన్‌పల్లి చెందిన 8 నాయి బ్రాహ్మణ కుటుంబాలు గతంలో ఓ గ్రామంలో కలిసి ఉండేవి. ఆ సమయంలో భూ తగాదాలు, ఇంటి స్థలాల గొడవలతో కొట్టుకునేవారు. పగలు ప్రతీకారాలతో మాటలు కరువయ్యాయి. కుటుంబ పరిస్థితులు బాగోలేక కొందరు హైదరాబాద్ వలస వెళ్లారు. అయినా ఒకరంటే మరొకరికి గిట్టదు. ముఖాలు కూడా చూసుకునే వారు కాదు. పిల్లలు సైతం పగలతో, కక్షతో రగిలిపోయేవారు. అయితే తాజాగా వీరంతా బలగం సినిమాను చూశారు. అందులోని గ్రామీణాల్లో పరిస్థితులను తమకు అన్వయించుకుని.. దుఃఖ సాగరంలో మునిగి తేలారు. ఈ సినిమాను చూసి చలించి.. ఇన్ని రోజులుగా తాము చేసిన తప్పును తెలుసుకున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అని తెలుసుకుని.. వారందరూ కలిసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న వారంతా తమ స్వగ్రామం మాసన్‌పల్లికి చేరుకున్నారు. దాయాదుల కుటుంబాల వారు, వారి పిల్లలు కలసి బలగం సినిమా గురించి చర్చించుకొన్నారు. పగలు, గొడవలు పక్కన పెట్టి కలిసుండాలని నిర్ణయించుకున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular