Spaceships
Spaceships: తొమ్మిది నెలలు ISS లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బుధవారం తెల్లవారుజామున 3:28 గంటలకు భూమికి చేరుకున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో ఆమెతో పాటు మరో నలుగురు వ్యోమగాములను తీసుకొని సముద్రంలో సురక్షితంగా దిగింది. దీనితో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ క్రూ డ్రాగన్ సముద్రంలోనే ల్యాండ్ అయింది.
Also Read: సీన్ రివర్స్.. కారు జోరు.. కాంగ్రెస్ బేజారు..
అంతరిక్షంలో నుంచి భూమికి వచ్చే వ్యోమ నౌకలను శాస్త్రవేత్తలు సముద్రంలోనే ల్యాండ్ చేస్తారు. క్రూ డ్రాగన్ ల్యాండింగ్ కోసం కూడా నాసా నేలను ఎంచుకోకుండా సాగరాన్ని ఎంపిక చేసింది. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. వ్యోమనౌకల ల్యాండింగ్ విషయంలో దేశాలు వేర్వేరు పద్ధతులను అవలంబిస్తున్నాయి. రష్యా తమ వ్యోమనౌకలను నేలపై దించగా, అమెరికా సముద్ర జలాలను ఎంచుకుంటోంది.
రష్యాలో నేలపై..
రష్యా విషయానికొస్తే, సముద్ర ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాలు అందుబాటులో లేకపోవడం ఒక ప్రధాన కారణం. బేరెంట్స్ సీ, లాప్టెవ్ సముద్రం, తూర్పు సైబీరియా సముద్రం వంటి జలాలు ఉన్నప్పటికీ, అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఒకవేళ వ్యోమనౌకలోకి నీరు చొచ్చుకొస్తే, వ్యోమగాములు తీవ్ర శీతల పరిస్థితుల్లో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అంతేకాక, సహాయ బృందాలు వ్యోమనౌకను సముద్రం నుంచి వెలికితీయడం కూడా కష్టతరమవుతుంది. కొన్ని ప్రాంతాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, అవి అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉండటం వల్ల రష్యా వాటిని ఉపయోగించడానికి ఇష్టపడదు. దీనికి తోడు, రష్యాలో జనావాసాలు లేని విశాలమైన భూభాగాలు ఉండటంతో, వాటిని ల్యాండింగ్ కోసం వినియోగిస్తోంది. రెట్రో రాకెట్లు, పారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించి, నేలపై సురక్షితంగా దిగేలా చేస్తోంది. చైనా కూడా ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఇలాంటి పద్ధతినే అనుసరిస్తోంది.
అమెరికాలో సముద్రంలో..
అమెరికా విషయంలో, భౌగోళికంగా అనుకూలమైన సాగరాలు అందుబాటులో ఉండటం ప్రధాన బలం. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు ఉండటం, భారీ నౌకాదళ సమక్షంలో సహాయ బృందాలను మోహరించే సామర్థ్యం వంటివి అమెరికాకు కలిసొచ్చాయి. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన తర్వాత, పారాచూట్లతో వేగాన్ని తగ్గించి, సముద్రంలో సునాయాసంగా దిగడం ద్వారా వ్యోమగాములకు హాని కలగకుండా చూసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ పద్ధతిలో చివరి దశలో రాకెట్ ఇంజిన్లు వాడాల్సిన అవసరం లేదు. గతంలో మెర్క్యూరీ, జెమినీ, అపోలో వంటి వ్యోమనౌకలు, ఇప్పుడు క్రూ డ్రాగన్ కూడా సాగర ల్యాండింగ్‌నే ఎంచుకుంది. 2011 వరకు స్పేస్ షటిళ్లు మాత్రం రన్వేలపై విమానాల్లా దిగేవి. భారత్ కూడా తన గగన్యాన్ కార్యక్రమంలో సముద్ర ల్యాండింగ్ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది.
సముద్ర ల్యాండింగ్‌లో ప్రయోజనాలు..
సముద్రంలో ల్యాండింగ్ లో చాలా ఉన్నాయి. నీరు తక్కువ సాంద్రత, చిక్కదనం కలిగి ఉంటుంది కాబట్టి, ల్యాండింగ్ సమయంలో వ్యోమనౌకకు కూషన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల వ్యోమనౌక దెబ్బతినే అవకాశం తక్కువ. సాగరం విశాలంగా ఉండటం వల్ల, ల్యాండింగ్ స్థానం కొంత పక్కకు మళ్లినా సమస్య ఉండదు. అంతేకాక, సహాయ బృందాలు త్వరగా చేరుకొని వ్యోమగాములను సురక్షితంగా బయటకు తీసుకురావడం సులభం. ఈ కారణాల వల్ల నాసా సముద్ర ల్యాండింగ్‌ను ఎంచుకుంది, ఇది క్రూ డ్రాగన్ విజయవంతమైన తిరిగొచ్చేందుకు దోహదపడింది.