BRS Vs Congress
BRS Vs Congress: తెలంగాణలో బీఆర్‌ఎస్(BRS) అలియాస్ టీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉంది. మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్(Congress) నాటి అధికార పార్టీని గట్టిగా ఎదుర్కొనలేకపోయింది. ప్రతిపక్షం బలపడుతుందనుకున్న సమయంలో కేసీఆర్(KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ, రెండోసారి.. కాంగ్రెస్ జోరు పెంచింది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీని చెడుగుడు ఆడుకుంది.
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు సరిగ్గా సరిపోతుంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా(Social Media)ను సమర్థవంతంగా వినియోగించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, చేసింది కూడా చెప్పుకోలేకపోతోంది. ప్రచారంలో వెనుకబడింది. సోషల్ మీడియా వింగ్ అయితే పూర్తిగా బలహీనపడింది. దీంతో ఇప్పుడు బీఆర్‌ఎస్ సోషల్ మీడియాను అందిపుచ్చుకుంటోంది. 2023 ఎన్నికల తర్వాతనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS working Prasident) కేటీఆర్.. తాము సోషల్ మీడియాను సరిగా వినియోగించుకోలేక ఓడిపోయామని ప్రకటించారు. ఇప్పుడు ఆయనే సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను పచ్చిగా ఎండగడుతున్నారు.
ఎదుర్కొనలేక చేతులెత్తేసిన కాంగ్రెస్..
అధికార కాంగ్రెస్ పార్టీ ఏ సోషల్ మీడియాను ఎన్నికల సమయంలో బలంగా వాడుకుందో.. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ప్రతిపక్షం దండయాత్ర చేస్తున్నా.. తిప్పికొట్టలేక చేతులు ఎత్తేస్తోంది. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా దాడులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతోందనే అభిప్రాయం కొంతమంది రాజకీయ విశ్లేషకులు, ప్రజలలో వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాను ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వాగ్దానాల అమలులో లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ వ్యూహం ద్వారా ప్రజల్లో చర్చను రేకెత్తించడంలో బీఆర్‌ఎస్ కొంతవరకు సఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.
సెల్ఫ్ డిఫెన్స్..
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, ఈ సోషల్ మీడియా ఒత్తిడిని తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ డిఫెన్స్‌లో పడుతోంది. రక్షణాత్మక వైఖరిని అవలంబిస్తోంది. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా టీమ్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో కూడిన పోస్టులను విస్తృతంగా ప్రచారం చేస్తోంది, దీనికి జవాబుగా కాంగ్రెస్ తమ సోషల్ మీడియా వ్యూహాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే, బీఆర్‌ఎస్ యొక్క చురుకైన మరియు దూకుడైన ప్రచార శైలిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఇంకా వెనుకబడి ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు. ఈ పరిస్థితి కాంగ్రెస్‌కు ఒక సవాలుగా మారింది. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో బీఆర్‌ఎస్ చూపిస్తున్న చాకచక్యం వారిని ఒత్తిడిలోకి నెట్టుతోంది. దీనికి ప్రతిస్పందనగా, కాంగ్రెస్ కూడా తమ సోషల్ మీడియా బృందాలను బలపరచడం, విమర్శలకు తిరిగి సమాధానాలు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతోంది, కానీ ఇది ఇంకా పూర్తి స్థాయిలో ప్రభావవంతంగా మారలేదని విశ్లేషకులు అంటున్నారు.