ISS Chennai: వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్).. శుక్రవారం రాత్రి చెన్నై వాసులను కనువిందు చేసింది. నిశీధిలో మిలమిలా మెరుస్తూ కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు ఆ అరుదైన దృశ్యాలను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవలే చెప్పిన నాసా..
మే 8 నుంచి 23వ తేదీల మధ్య భారత్‌లోని పలు నగరాల ప్రజలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కనిపిస్తుందని ఇటీవల నాసా తెలిపింది. ప్రస్తుతం సూర్యుడి కాంతి దీనిమీద ప్రతిబింబించడంతో ఈ స్పేస్ స్టేషన్ భారత వాసులకు కనిపిస్తుందని పేర్కొంది. సాధారణంగా చంద్రుడు కూడా మనకు ఇలాగే కనిపిస్తాడని తెలిపింది. అయితే ఐఎస్‌ఎస్ జాబిల్లి అంత ప్రకాశవంతంగా ఉండకపోవడంతో పగలు చూడలేమని తెలిపింది. రాత్రివేళల్లో మెరుస్తూ కనిపిస్తుందని వెల్లడించింది. కొన్ని వారాలపాటు ఇది పలు నగరాల్లో దర్శనమిస్తుందని తెలిపింది.
చెప్పినట్లుగానే కనిపించిన ఐఎస్‌ఎస్..
నాసా చెప్పినట్లుగానే చెన్నైలో శుక్రవారం(మే 10) రాత్రి 7 గంటలకు కొన్ని నిమిషాలపాటు మెరుస్తూ కనిపించి కనువిందు చేసింది. మిలమిలా మెరుస్తూ వేగంగా ప్రయాణించడాన్ని చెన్నైవాసులు గమనించారు. మే 14 వరకు పలు సమయాల్లో మళ్లీ స్పేస్ స్టేషన్ కనిపిస్తుందని అంతరిక్ష నిపుణులు తెలిపారు. శనివారం ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కూడా ఐఎస్‌ఎస్ కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మూడో అతి పెద్దది ఐఎస్‌ఎస్..
ఆకాశంలో మెరిసే వస్తువుల్లో మూడో అతిపెద్దది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే. ఇది మానవ నివాసయోగ్యమైన, మానవ నిర్మిత ఉపగ్రహం. భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇది భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 93 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు ఐఎస్‌ఎస్ భూమిని చుట్టేస్తుంది. అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలలపాటు ఇందులో పరిశోధనలు చేస్తున్నారు.
Got a spectacular view of the International Space Station passing over Chennai tonight. Thanks, @NASA and @Space_Station for the heads up!..#SpotTheStation #ISS pic.twitter.com/cVPB6a6q7O
— Aravinth S (@ImAS_offl) May 10, 2024