MS Dhoni: ఒంటి చేత్తో సిక్స్.. ధోని కాళ్ళ మీద పడ్డ అభిమాని..

చెన్నై జట్టు లక్ష్యసాధనలో 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిచెల్, మోయిన్ అలీ 57 బంతుల్లో 109 రన్స్ పార్ట్నర్ షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత చెన్నై జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 11, 2024 2:10 pm

MS Dhoni

Follow us on

MS Dhoni: చావో, రేవో తేల్చుకోవాల్సిన సమయంలో చెన్నై జట్టు డీలా పడిపోయింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో చెత్త ఆట తీరు ప్రదర్శించింది. గుజరాత్ జట్టుతో చెన్నై వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. 35 పరుగుల తేడాతో ఓడిపోయి ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. ఈ గెలుపుతో గుజరాత్ తన ప్లే ఆఫ్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది. ఈ ఓటమితో చెన్నై జట్టు టాప్ -4 లోనే కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 231 రన్స్ చేసింది. గిల్ 104, సాయి సుదర్శన్ 103 రన్స్ చేసి అదరగొట్టారు. వీరిద్దరూ ఏకంగా తొలి వికెట్ కు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై జట్టులో తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. మిచెల్ 63, మొయిన్ అలీ 56 పరుగులు చేసి అదరగొట్టారు. అయితే సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడం.. కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో చెన్నై ఓడిపోయింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు, రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు.

చెన్నై జట్టు లక్ష్యసాధనలో 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిచెల్, మోయిన్ అలీ 57 బంతుల్లో 109 రన్స్ పార్ట్నర్ షిప్ నెలకొల్పారు. ఆ తర్వాత చెన్నై జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో వచ్చిన ధోని 11 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్స్ లు కొట్టి 26* రన్స్ చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడు ఆ స్థాయిలో ఆడటం వల్ల, ఓటమి అంతరం మాత్రమే తగ్గింది. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. చెన్నైకి కాస్తో కూస్తో ఆనందం దక్కిందంటే అది కేవలం ధోని బ్యాటింగ్ ద్వారా మాత్రమే. ధోని ఒంటి చేత్తో రెండు సార్లు బంతిని బౌండరీకి తరలించాడు. హెలికాప్టర్ షాట్ రూపంలో సిక్స్ కొట్టాడు. ధోని కొట్టిన సిక్స్ ద్వారా, ఈ సీజన్లో 1,063 సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో అత్యధిక సిక్సర్లు నమోదైన రెండవ సీజన్ గా ఐపిఎల్ -2024 నిలిచింది. 2022 సీజన్లో 1,062 సిక్సర్ల రికార్డును ఈ సీజన్ బద్దలు కొట్టింది. అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్ గా 2023 అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2023లో 1,1 24 సిక్స్ లు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం ఆటగాళ్ల జోరు చూస్తుంటే ఆ సీజన్ రికార్డు బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఈ మ్యాచ్లో ఒక అభిమాని భద్రతా నిబంధనలు ఉల్లంఘించి మైదానంలోకి దూసుకొచ్చాడు. చెన్నై ఇన్నింగ్స్ లో రషీద్ ఖాన్ వేసిన బంతిని ధోని ఆడబోగా.. అది అతడి ప్యాడ్లు తాకుతూ వెళ్ళింది. రషీద్ ఖాన్ అప్పీల్ చేయగా.. ఎంపైర్ పట్టించుకోలేదు. దీంతో గుజరాత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ రాహుల్ తేవాటియా డీఆర్ఎస్ కోరాడు. ఈ నేపథ్యంలోనే అభిమాని భద్రతను ఛేదించుకుని.. మైదానంలోకి ప్రవేశించాడు. మహేంద్ర సింగ్ ధోనిని ఆలింగనం చేసుకున్నాడు.. అతడి పాదాల మీద పడ్డాడు. దీంతో ఉలిక్కిపడిన స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది అతడిని బయటికి తీసుకొచ్చారు.