Technological Fraud : రోజురోజుకు స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతోంది. ప్రతీపనికి సెల్ ఫోన్ అనేది అత్యంత ముఖ్యమైపోయింది. మాటల నుంచి బ్యాకింగ్ లావాదేవీల వరకు ఫోన్ అనేది అత్యవసరమైపోయింది. ఈనేపథ్యంలో సాంకేతిక మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. మంచి వెనుక చెడు ఉన్నట్టు స్మార్ట్ ఫోన్ వాడకం వెనుక కూడా సైబర్ మోసగాళ్ళు పొంచి ఉన్నారు. రోజుకో తీరుగా ప్రజలను మోసం చేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రజల నుంచి విపరీతంగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. టెలికాం విభాగం ఆధ్వర్వంలో “చక్షు” అనే పోర్టల్ ను అందుబాటుులోకి తెచ్చింది. ఇంతకీ ఇది ఎలా పని చేస్తుందంటే..
మోసపూరితమైన కాల్స్ వస్తే ఈ పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చు. ఫ్రాడ్ ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజెస్ వస్తే ఇందులో కంప్లయింట్ చేయవచ్చు. ఫిర్యాదు చేయాలంటే ముందుగా sancharsaathi.gov.in వెబ్ సైట్ లోకి వెళ్ళి కిందకు స్క్రోల్ చేస్తే సిటిజన్ సెంట్రిక్ సెక్షన్ వస్తుంది. దానిలో “చక్షు” అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవాలి. నకిలీ కాల్స్, మెసేజ్, వాట్సాప్.. ఇలా మీకు ఫేక్ సమాచారం ఏ ప్లాట్ ఫారమ్ నుంచి వచ్చిందో ముందుగా నిర్ణయించుకోవాలి. అనంతరం డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్ళాలి. అది ఏ తరహా మోసమో గ్రహించాలి. తర్వాత స్క్రీన్ షాట్ తీసి దానికి అనుసంధానించాలి. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫేక్ కాల్స్ కు సంబంధించిన ఫోన్ నంబర్, కాల్ వచ్చిన తేదీ, సమయాన్ని ఎంటర్ చేయాలి. మోసం జరిగిన విధానాన్ని కూడా అందులో పొందుపరచాలి
చేసిన కంప్లయింట్ కు సంబంధించిన వివరాలు మొత్తం నమోదు చేసిన అనంతరం పర్సనల్ డిటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీతో దానిని నిర్ధారించుకోవాలి. మీ ఫిర్యాదు స్వీకరించిన అనంతరం టెలికాం విభాగం టెక్ నిపుణులతో దర్యాప్తు చేపడుతుంది. నకిలీ కాల్స్ బెడద నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. కేవలం ఇవి మాత్రమేకాదు.. ఆన్ లైన్ మోసాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర టెలికాం విభాగం ఈ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.