Asteroid: భూమిపైకి దూసుకొస్తున్న గ్రహశకలం.. మోదీ మైదానమంత పరిమాణం.. ముప్పు తప్పదా?

గ్రహ శకలాలు... అంతరిక్ష కేంద్రానికి ముప్పుగా మారుతున్నాయని ఇటీవలే నాసా ఆందోళన వ్యక్తం చేసింది. అంతరిక్ష వ్యర్థాలు కూడా ఉప గ్రహాలకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొంది. వీటిని తగ్గించకుంటే భవిష్యత్తులో పెను ముప్పు తప్పదని హెచ్చరించింది. అయితే గ్రహ శకలాలలో భూమికి కూడా ముప్పు పొంచి ఉంది.. అంతరిక్ష పరిధి నుంచి భూమి పరిధిలోకి వస్తే భారీ నష‍్టం తప్పదు.

Written By: Raj Shekar, Updated On : September 11, 2024 10:00 am

Asteroid

Follow us on

Asteroid: గ్రహాలు.. తమ గమనంలో భాగంగా అంతరిక్షంలోని ఇతర గ్రహాలను కానీ, ఇతర వ్యర్థాలను కానీ, ఉప గ్రహాలను కానీ ఢీకొన‍్నప్పుడు శకలాలుగా విడిపోతాయి. గ్రహశకలం దాదాపు 1,000 కిమీ (600 మైళ్ళు) లేదా అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన ఉంటుంది. ఇవి ప్రధానంగా అంగారక గ్రహం మరియు బృహస్పతి కక్ష్యల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయి. ప్రధాన గ్రహాలకు సంబంధించి వాటి చిన్న పరిమాణం, పెద్ద సంఖ్యలో ఉన్నందున గ్రహ శకలాలను చిన్న గ్రహాలు అని కూడా అంటారు. మన భూమికి దగ్గరగా 30 వేల గ్రహ శకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నదని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ పరిశోధకులు తెలిపారు. అందులో 1,425 గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని, వీటిపై టెలిస్కోప్‌తో ఓ కన్నేసి ఉంచాలని వెల్లడించారు. ఈ శకలాల్లో ఒకటి ఇప్పుడు భూమివైపు దూసుకొస్తోంది. దీని పరిమాణం అహ్మదాబాద్ నగరంలో నిరి‍్మంచిన ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్రమోదీ స్టేడియం అంత పరిమాణం ఉందట. ఈ గ్రహశకలాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు.

2029లో భూమికి సమీపంలో..
ఈ గ్రహ శకలం 2029లో భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహశకలం పేరు అపోఫిస్ అని తెలిపారు. మరోవైపు, ఈ గ్రహశకలం ద్వారా భూమికి పొంచివున్న ముప్పును నివారించేందుకు ఏ దేశం ముందుకు వచ్చినా తాము పూర్తిగా సహకారం అందిస్తామని సోమనాథ్ తెలిపారు. ఈ అపోఫిస్ ఆస్టరాయిడ్‌ భూమికి 32,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం పరిభ్రమిస్తుందని తెలిపారు. అంటే భారత జియోస్టేషనరీ శాటిలైట్స్ పరిభ్రమించే కక్ష్యల కంటే దగ్గరగా ఈ ఆస్టరాయిడ్ ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. పరిమాణం పరంగా చూస్తే ఇంత పెద్ద గ్రహశకలం గతంలో ఎప్పుడూ భూమికి ఇంత సమీపం నుంచి వెళ్లలేదని వివరించారు. ఇది భారత అతిపెద్ద విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే కూడా పెద్దగా ఉంటుందన్నారు. ఈ గ్రహశకలం పరిమాణం సుమారు 340 – 450 మీటర్ల వ్యాసం కలిగి ఉండొచ్చని చెప్పారు. 140 మీటర్ల వ్యాసం కంటే పెద్దగా ఉన్న ఏ గ్రహశకలం భూమికి సమీపం నుంచి ప్రయాణించినా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారని సోమనాథ్ చెప్పారు.

దారి మళ్లించేందుకు యత్నం..
భారీ గ్రహశకలం.. మానవాళి మనుగడకు ముప్పు అని సమనాథ్‌ తెలిపారు. ఆ ముప్పును ఎదుర్కొనే విషయంలో ఇస్రో క్రియాశీలకంగా ఉందని చెప్పారు. నెట్‌వర్క్‌ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ ఆస్టరాయిడ్ ‘అపోఫిస్’ను నిశితంగా పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో భూమికి పొంచివుండే ముప్పులను నివారించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. అన్ని దేశాలకు తమ సహకారం అందిస్తామని తెలిపారు. 300 మీటర్ల కంటే పెద్దగా ఉంటే గ్రహశకలం ఖండాలను నాశనం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇక 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసం ఉండే గ్రహశకలాలు ఢీకొడితే భూ వినాశనం తప్పదన్నారు. ఈ ‘అపోఫిస్’ను తొలిసారి 2004లో గుర్తించామని తెలిపారు. విలయాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడి పేరును ఈ గ్రహశకలానికి పెట్టినట్లు పేర్కొన్నారు.