https://oktelugu.com/

Kodali Nani : ఏ క్షణమైనా కొడాలి నాని అరెస్ట్.. ఆ కేసులతోనే!

కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై దృష్టి పెట్టింది. వారిపై పాత కేసులను తిరగదోడుతోంది. వారికి అవకాశం ఇవ్వకుండా అరెస్టుల పర్వానికి దిగింది. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్టు చేసింది. త్వరలో జోగి రమేష్ తో పాటు కొడాలి నాని అరెస్టు తప్పదని ప్రచారం సాగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : September 11, 2024 / 10:29 AM IST

    Kodali Nani

    Follow us on

    Kodali Nani : వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. చాలా రోజులు పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ ఇటీవల మళ్లీ నోరు తెరుస్తున్నారు. వరద సహాయక చర్యలపై మాట్లాడారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో మాదిరిగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయకున్నా.. విధానాలపై మాట్లాడడం విశేషం. అయితే చంద్రబాబుపై అదే పనిగా విమర్శలు చేస్తున్న కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లాలో కేసు నమోదయింది. ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజా పరిస్థితులను చూస్తే కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొన్ని కేసుల విషయంలో అరెస్టు చేస్తారని భావిస్తున్న కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో.. అందరి దృష్టి కొడాలి నాని పై పడింది. అందుకు తగ్గట్టుగానే టిడిపి నేతలు ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.

    * వ్యక్తిగత దాడిలో దిట్ట
    వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంలో ముందుంటారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. తరచూ అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొడాలి నాని అరెస్టు తప్పదని ప్రచారం సాగింది. టిడిపి శ్రేణులు సైతం అదే ఆశించాయి.అయితే ప్రభుత్వం వచ్చి 90 రోజులు అవుతున్న కొడాలి నాని పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో టిడిపిలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. అందుకే కొడాలి నాని పై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం.

    * ఇప్పటికే నందిగాం సురేష్ అరెస్ట్
    టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసీల రఘురాం తదితరుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ కూడా తప్పదని తెలుస్తోంది. వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో.. కొడాలి నాని పై కేసులు నమోదు అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అరెస్టు తప్పకుండా ఉంటుందని ప్రచారం సాగుతోంది.

    * గుడివాడలో చెక్
    వాస్తవానికి గుడివాడలో ప్రభుత్వం ఇప్పటికే తన టాస్క్ ను ప్రారంభించింది. కొడాలి నాని అనుచరుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటోంది. వాటిని యజమానులకు అప్పగిస్తోంది. అసలు కొడాలి నాని గుడివాడ ముఖమే చూడడం లేదు. ఒకానొక దశలో ఆయన రాజకీయాలనుంచి తప్పుకుంటారని ప్రచారం సాగింది. అయితే తిరిగి వైసిపి కార్యకర్తలపాల్లో యాక్టివ్ అవుతుండడంతో కట్టడి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వీలైనంత వరకు ఎక్కువ కేసులు నమోదు చేసి ఉక్కిరి బిక్కిరి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం వరదల ముంపు తగిన నేపథ్యంలో పాలనతో పాటు ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని అంశం తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల్లో ఆయన అరెస్టు తప్పదన్న టాక్ ప్రారంభమైంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.