Monkeys: మనం కోతి నుంచే పుట్టామని గొప్పగా చెప్పుకుంటాం. అయితే మనకు కోతులకు ఉన్న తేడా ఒక్కటే.. మనకు మెదడు వృద్ధి చెందింది. జ్ఞానం వచ్చింది. కోతులకు ఇవేమీ తెలియదు. కోతి చేష్టలు చూస్తుంటే పదేళ‍్ల క్రితం వరకు ముచ్చటేసేది. కోతులు ఆడించే వారు వస్తే అందరం చప్పట్లు కొట్టేవాళ్లం. కానీ ఇప్పుడు కోతులు జనారణ్యంలోనే ఎక్కువగా ఉంటున్నాయి. మనతో కలిసి సహజీవనం చేస్తున్నాయి. గ్రామాల్లో అయితే బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్ల పైకప్పులు పీకేస్తున్నాయి. ఇళ్లలో చొరబడి వస్తువులు, ఆహార పదారా‍్థలు ఎత్తుకెళ్తున్నాయి. కొన్ని రోజులుగా కోతులు.. మనుషులపై తిరగబడుతున్నాయి. దాడులు చేస్తున్నాయి. దీంతో ఇప్పుడ కోతులు అంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో కోతులతో మనుషులకు ముప్పే అని చాలా మంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కోతులు హంగామా సృష్టించాయి. రెండు గంటలపాటు హైరానా చేశాయి. జనం భయంతో పరుగులు తీశారు. మండల కేంద్రంలో తోట శంకర్ ఇంట్లో రెండు కోతులు చొరబడ్డాయి. ఒక్కసారిగా రెండు కోతులు రావడంతో బెదిరిన ఇంటి కుటుంబసభ్యులు అక్కడి బయటకు పరుగు తీశారు.
గడిచ పెట్టుకుని..
రెండు కోతులు ఇంట్లో చొరబడిన వెంటనే ఇంట్లోని వారు బయటకు వెళ్లడంతో కోతులు.. తలుపులు మూసి గడియ పెట్టుకున్నాయి. ఇల్లంతా చిందరవందర చేశాయి. అయితే వాటికి తిరిగి బయటకు ఎలా రావాలో తెలియలేదు. దీంతో భయంతో అరవడం మొదలు పెట్టాయి. కోతులు ప్రమాదంలో ఉన్నట్లు అరుపుల ద్వారా గుర్తించిన ఊరిలోని మిగతా కోతులన్నీ ఇల్లును చుట్టుముట్టాయి. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారింది. ఇంటి యజమాని స్థానికుల సాయంతో గడియను తీసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. పైగా వారు చేసే ప్రయత్నం వాటికి ప్రమాదంగా భావించిన కోతులు మరింత బెదిరాయి. కర్రతో కిటికిలో నుండి గడియ తీసేందుకు ప్రయత్నించిన స్థానికులు విఫలమయ్యారు. కానీ ప్రయత్నాన్ని సైతం కోతులు అడ్డుకున్నాయి.
కిటికీని కట్ చేసి..
చివరకు స్థానికులు కట్టర్ సహాయంతో ఓ కిటికీని కట్ చేసి తొలగించారు. వాటికి కనిపించేలా అక్కడ రెండు కొబ్బరి చిప్పలు వేశారు. దీంతో ఇంట్లో దూరిన రెండు కోతులు బయటకు రాలేదు. భయంతో లోపలే ఉండిపోయాయి. అరగంట సమయం తీసుకుని మనుషుల కదలికలు కనపడకపోవడంతో బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.