AI Impact On Jobs: శాస్త్ర సాంకేతిక రంగాలలో ఏఐ నెలకొల్పుతున్న సంచలనం మాములుగా లేదు. అన్ని విభాగాలలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పెను ప్రకంపనలు కలిగిస్తోంది. ఏఐ వల్ల అన్ని రంగాలలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. తయారీ రంగం నుంచి అంతరిక్షం వరకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గణనీయమైన మార్పును చూపిస్తోంది. దీంతో పనులన్నీ అత్యంత కచ్చితత్వంతో జరుగుతున్నాయి. మానవవనరుల అవసరం కూడా చాలా తగ్గుతోంది.
ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని ఐటీ కంపెనీలు ఆటోమేషన్ వైపు వెళ్లిపోతున్నాయి. మనుషుల అవసరం లేకుండా పనులను చక్కపెట్టుకుంటున్నాయి. దీనివల్ల ఉద్యోగుల అవసరం లేకుండాపోతోంది. ఇప్పటికే అన్ని కంపెనీలు ఉద్యోగులను బయటకు పంపేశాయి. పంపిస్తున్నాయి కూడా. తొలిసారిగా ఏఐ విషయంలో కీలక ప్రకటన చేశాడు ఓపెన్ ఏఐ సీఈవో శామ్ అల్ట్ మన్.
వైట్ కాలర్ ఉద్యోగాలు ఏఐవల్ల ప్రభావితం కావని అల్ట్ మన్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ ప్రారంభించినప్పుడు ఆర్థికవ్యవస్థల మీద తీవ్రంగా ప్రభావం పడుతుందని అందరూ అనుకున్నారు. ఆల్ట్ మన్ కూడా ఇదే భావించాడు. కానీ ఈ విషయంలో ఆల్ట్ మన్ అంచనా పూర్తిగా తప్పింది. చాలావరకు ప్రారంభస్థాయి వైట్ కాలర్ ఉద్యోగాలు స్థిరంగా సాగుతున్నాయి. మార్కెట్ లో ఏర్పడిన ఒడిదుడుకులు కొంతమేర ఇబ్బంది కలిగించినప్పటికీ వాటి ప్రభావం తీవ్రంగానే ఉంది.
ఏఐ అత్యంత సమర్థవంతమైన టెక్నాలజీ అయినప్పటికీ మనుషుల భాగస్వామ్యం లేకుండా అది పనిచేయడం దాదాపు అసాధ్యమని ఆల్ట్ మన్ పేర్కొన్నారు. శ్లాక్, ఇమెయిల్ సందేశాలకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించినా..అది ఆశించిన స్థాయిలో అనుభూతి ఇవ్వడం లేదని ఆల్ట్ మన్ ప్రకటించడం విశేషం.
ఏఐ వల్ల అమెజాన్, హెచ్ ఎస్ బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, సీబీఏ వంటి సంస్థలు తమ ఉద్యోగులను ఏఐతో భర్తీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈధోరణిని మిగతా కంపెనీలు కూడా పాటిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆల్ట్ మన్ ప్రకటించలేదు. కొన్ని అవసరాలు మాత్రమే ఏఐ ద్వారా తీరుతాయని ఆల్ట్ మన్ ప్రకటించినప్పటికీ.. అన్ని కంపెనీలు దాదాపు మెజార్టీ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేస్తుండటం ఇక్కడ గమనార్హం.
మరో వైపు ఓపెన్ ఏఐ సరికొత్తగా అడుగులు వేస్తోంది. అమెరికాలో ఐపీవో కోసం సిద్ధమవుతోంది.ఏకంగా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువను సొంతం చేసుకోవడానికి రెడీ అవుతోంది. కనీసం 5.7 లక్షల కోట్లను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. కాగా, ఆల్ట్ మన్ ప్రకటనను ఐటీ నిపుణులు మరో విధంగా చెబుతున్నారు. ఆల్ట్ మన్ ప్రకటనకు క్షేత్రస్థాయి పరిస్థితికి సంబంధం లేదని, ఏఐ వల్ల ఇది శాంపిల్ మాత్రమే.. ముందుంది మొసళ్ల పండగ అని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
