Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా? చన్నీటి స్నానం బెటరా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అందరికీ ఒకే రకమైన నీరు సరిపోదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాతావరణం, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఏ రకమైన నీటితో స్నానం చేయాలి? అనేది నిర్ణయించుకోవాలి. ఎవరికి ఏ నీరు మంచిదో ఇప్పుడు చూద్దాం..
దాదాపు చాలా మంది చల్లటి నీటితో స్నానం చేస్తుంటారు. ఎందుకంటే వేడి నీరు ప్రతీ చోటా అందుబాటులో ఉండకపోవచ్చు. చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరం చురుకుదనాన్ని పొందుతుంది. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత చల్లటి నీరు శరీరంపై పడినప్పుడు రక్తనాళాలు తాత్కాలికంగా కుంచించుపోతాయి.ఈ క్రమంలో మనసు కూడా ఉత్తేజంగా మారుతుంది. తీవ్రమైన వ్యాయామం లేదా క్రీడల తర్వాత చన్నీటి స్నానం ఉపయోగం అని అంటున్నారు. ఈ స్నానం వల్ల కండరాల నొప్పి, వాపు వంటి లక్షణాలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు సడలిపోతాయి. దీంతో శరీరానికి రిలాక్సేషన్ లభిస్తుంది. రోజంతా పని చేసి అలసిపోయిన వారికి, ఎక్కువసేపు నిలబడి పనిచేసే వారికి లేదా శారీరక శ్రమ చేసిన వారికి వేడి నీటి స్నానమే బెటర్ అని అంటున్నారు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం సౌకర్యంగా ఉంటుంది. అయితే నీరు మరీ వేడిగా ఉండకూడదు. అధిక వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ నూనెలు తొలగిపోయి చర్మం పొడిబారడం, దురద, మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, అధిక లేదా తక్కువ రక్తపోటు ఉన్నవారు, వృద్ధులు చాలా వేడి లేదా చాలా చల్లటి నీటితో స్నానం చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారిగా తీవ్రమైన చలి లేదా వేడి శరీరంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత గురించి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.