WTC Final South Africa Playing XI : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్ మైదానంలో కంగారు జట్టుతో సఫారీలు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోతున్నారు. ఇందులో భాగంగా మార్క్రం, రికెల్టన్ ను ఓపనర్లుగా బరిలోకి దింపుతోంది. వీరిద్దరు కూడా ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యా జట్టు తరఫున అదరగొట్టారు. ఇక నెంబర్ మూడు లో స్టబ్స్ ను ఆడించే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ లో బవుమా, బెండింగ్ హామ్, వెర్రేయన్ ఆడనున్నారు. పేస్ బౌలింగ్ బాధ్యతను రబాడా, జాన్సన్ భుజాలకు ఎత్తుకోనున్నారు. కేశవ మహారాజ్ స్పిన్ బాధ్యతను మోస్తాడు. మొత్తంగా సఫారి జట్టులో ఈసారి యువత, అనుభవం సమ్మేళితంగా కనిపిస్తోంది.
ఇంతవరకు సఫారీ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్లలేదు. సఫారి జట్టు ఫైనల్స్ వెళ్లడంతో అభిమానులు అంచనాలు పెరిగిపోయాయి. సుదీర్ఘకాలంగా ప్రోటీస్ జట్టు ఐసీసీ ట్రోఫీ అందుకోలేదు. అదే అనేక సందర్భాల్లో చివరి అంచె దాకా వచ్చినప్పటికీ.. ఏదో ఒక లోపం వల్ల ప్రొటీస్ జట్టు ట్రోఫీ దక్కించుకోలేదు. అయితే ఈసారి ఎలాగైనా సరే డబ్ల్యూ టీ సీ ఫైనల్స్ లో విజయం సాధించాలని సఫారి జట్టు బలంగా భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఐడెన్ మార్క్రం, రికెల్టన్ కు ఓపెనింగ్ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో మార్క్రం కు అద్భుతమైన చరిత్ర ఉంది. ముఖ్యంగా కంగారు జట్టు మీద అత్యున్నతమైన రికార్డు ఉంది. ఇతడు ఎనిమిది ఇన్నింగ్స్ లలో 480 పరుగులు చేశాడు. ఇతడు సగటు 60 గా ఉంది. ఇటీవల రికెల్టన్ పాక్ తో జరిగిన సిరీస్లో 259 పరుగులు చేశాడు. తిరుగులేని ఫామ్ కనబరిచాడు.
మిడిల్ ఆర్డర్ లో స్టబ్స్, కెప్టెన్ బవూమా, డేవిడ్ బెడింగ్ హమ్, వెర్రేయన్ వంటి భీకరమైన బ్యాటర్లు ఉన్నారు. స్టబ్స్ మూడో నెంబర్ లో ఆడే అవకాశం ఉంది. ఇతడు ఇప్పటికే శతకం, అర్థ శతకం సాధించాడు. ఇక బవుమా సుదీర్ఘ ఫార్మాట్లో అదరగొడుతున్నాడు. ఏకంగా 503 పరుగులు చేశాడు. అతడి సగటు 55.88 వద్ద కొనసాగుతోంది.. కౌంటీ క్రికెట్ లో బెడింగ్ హమ్ విశేషమైన అనుభవం ఉంది. ఇటీవల అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. వెర్రేయన్ వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు. అతడు ఇప్పటికే రెండు శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ముల్డర్, జాన్సన్, బాష్ బంతి, బ్యాట్ తో రాణించే ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. ముల్డర్ అత్యవసర సమయంలో బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలర్ గా కూడా సేవలు అందిస్తాడు. జాన్సన్ 17 టెస్టులలో 73 వికెట్లు సాధించాడు. మూడు హాఫ్ సెంచరీలు కూడా తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. ఇక బాష్ తొలి టెస్ట్ లోనే ఐదు వికెట్లు సాధించాడు. అంతేకాదు 81 పరుగులు చేసి అదరగొట్టాడు.. ఇక రబాడా కూడా అద్భుతమైన బౌలర్. అతడు కంగారు జట్టు మీద 18 ఇన్నింగ్స్ లలో 49 వికెట్లు సాధించాడు. ఇతడి సగటు 23.08, మూడు సందర్భాల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు. ఒకసారి 10 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఇక స్పిన్ విభాగంలో కేశవ్ మహారాజ్ సత్తా చూపించే అవకాశం ఉంది.
ప్లేయింగ్ XI ఇదే
బవుమా(కెప్టెన్), బెడింగ్ హమ్, వెర్రేయన్, కేశవ్ మహారాజ్, రబాడా, ముల్డర్, స్టబ్స్, రికెల్టన్, మార్క్రం, జాన్సన్, బాష్.