Sunrisers : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ప్రారంభమై పది రోజులు కావస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికి రెండు మ్యాచ్ లు ఆడేసింది. రెండు మ్యాచ్ ల్లోనూ హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. లక్నో జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలుస్తుందని అంతా భావించారు. కొత్త సారధి రావడంతోపాటు జట్టులో పలు మార్పులు చేశారు. అయినా జట్టు విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఆదివారం మూడో మ్యాచ్ కు హైదరాబాద్ జట్టు సిద్ధమవుతున్న తరుణంలో.. విజయాన్ని చేజెక్కించుకుంటుందా..? లేదా..? అన్నది ఆసక్తి కలిగిస్తోంది.
కొత్త కెప్టెన్ వచ్చినా సరే సన్ రైజర్స్ జట్టు కథ మారలేదు. మొదటి మ్యాచ్ లో మాదిరిగానే హైదరాబాద్ జట్టు రెండో మ్యాచ్ లోను ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. కనీస స్కోర్ సాధించడంలో కూడా ఆ జట్టు బ్యాటర్లు విఫలం కావడంతో 121 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. చేజింగ్ లో లక్నో జట్టు మరో నాలుగు ఓవర్లు ఉండగానే 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో హైదరాబాద్ జట్టు ఓటమి పాలు కావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్ లోనైనా జట్టు గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
పంజాబ్ జట్టుతో నేడు తలపడనున్న హైదరాబాద్ జట్టు..
ఆదివారం మూడో మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ లకు సిద్ధమవుతోంది. సొంత మైదానం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో మూడో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా హైదరాబాద్ జట్టు విజయాల బాట పట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. గడిచిన రెండు మ్యాచ్ ల్లో 131, 121 పరుగులు మాత్రమే హైదరాబాద్ జట్టు చేసింది. దీంతో బ్యాటింగ్ డొల్లతనం బయట పడినట్లు అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్లో విజయం సాధించడం హైదరాబాద్ జట్టుకు అత్యవసరం. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు వెనుకబడిపోతుంది. ఈ మ్యాచ్ లో గెలుపుతో పుంచుకోవడానికి అవకాశం కలుగుతుంది.
మంచి భాగస్వామ్యాలు అవసరం..
జట్టు పరంగా చూస్తే బలంగానే కనిపిస్తోంది. కానీ గ్రౌండ్ లోకి దిగిన తర్వాత మెరుగైన ఆట తీరు కనబరచలేక చతికిలబడుతోంది హైదరాబాద్ జట్టు. కీలక ప్లేయర్లు చేతులెత్తేస్తుండడంతో జట్టుకు విజయాలు దక్కడం లేదు. గతేడాది అత్యధికంగా రూ.13.25 కోట్లు పెట్టి తీసుకున్న హారి బ్రూక్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. గడిచిన రెండు మ్యాచ్ ల్లోనూ స్పిన్నర్లు బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ కూడా నిరాశ పరుస్తున్నాడు. మొదటి మ్యాచ్ ఆడిన కెప్టెన్ మార్క్రమ్ కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఆదివారం నాటి మ్యాచ్లో వీరంతా రాణిస్తే గెలిచే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
తేలిపోతున్న బౌలింగ్ తో సమస్య..
ఇక బౌలింగ్ విభాగంలోనూ హైదరాబాద్ జట్టు తేలిపోతుంది. ఈ జట్టులో కీలక బౌలర్ గా ఉన్న భువనేశ్వర్ కుమార్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఓపెనింగ్ స్పెల్ వేస్తున్న భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు ఇస్తుండడంతో తర్వాత బౌలర్లు పై ఒత్తిడి పెరుగుతుంది. ఆదివారం నాటి మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇక ఫారుఖీ, ఆదిల్ రషీద్ కొంతవరకు మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఉమ్మడిగా జట్టు రాణిస్తే విజయాన్ని దక్కించుకునేందుకు అవకాశం ఉంది. ఆదివారం రెండో మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పంజాబ్ తో తలపడనుంది.
Web Title: Will sunrisers hyderabad hit the jackpot
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com