RCB: ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళ్తుందా? తాజా సమీకరణాలు చూస్తే బుర్ర బద్దలవ్వడం ఖాయం

ఇప్పటివరకు బెంగళూరు 9 మ్యాచులు ఆడింది. రెండు విజయాలు మాత్రమే దక్కించుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.. బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లడం దాదాపు కష్టం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమైతే కాదు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 26, 2024 6:27 pm

RCB

Follow us on

RCB: హైదరాబాద్ జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో గెలుపు దక్కించుకుంది. వరుస ఓటముల తర్వాత విజయం దక్కడంతో డూ ప్లెసిస్ సేన ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు చాలా మంది హైదరాబాద్ భారీ స్కోరు సాధిస్తుందని భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. బెంగళూరు అన్ని విభాగాలలో అద్భుతమైన ప్రదర్శన కొనసాగించడంతో హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ గెలుపు నేపథ్యంలో బెంగళూరు జట్టులో మళ్లీ ప్లే ఆఫ్ ఆశలు చిగురించాయి.

ఇప్పటివరకు బెంగళూరు 9 మ్యాచులు ఆడింది. రెండు విజయాలు మాత్రమే దక్కించుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.. బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లడం దాదాపు కష్టం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమైతే కాదు.. ఆర్సీబీ ఆ స్థాయికి చేరుకోవాలంటే కచ్చితంగా కొన్ని మ్యాజిక్స్ జరగాలి. కొన్ని అద్భుతాలు ఆవిష్కృతం కావాలి. ఈ లెక్కలన్నీ వేసుకుంటే బుర్ర బద్దలై పోవడం ఖాయం. బెంగళూరు ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. మిగతా ఐదు మ్యాచ్ లలో బెంగళూరు విజయం సాధించాలి. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. అన్ని పాయింట్లతో ప్లే ఆఫ్ పై బెంగళూరు ఆశలు పెట్టుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు.. కేవలం 14 పాయింట్ల తో బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లడం కష్టమే. అయితే ఇతర జట్లు సాధించిన ఫలితాలపై ఆ జట్టు ఆశలు పెట్టుకోవచ్చు. ఇందుకు కొన్ని జట్లు గెలవాలి, మరికొన్ని జట్లు ఓడిపోవాలి. కొన్ని మ్యాచ్లు రద్దు కావాలి. ఆ పరిణామాలు బెంగళూరుకు ప్లస్ అవుతాయి.. స్థూలంగా చెప్పాలంటే బెంగళూరుకు ప్లే ఆఫ్ అవకాశాలు రద్దు కాలేదు. అలాగని ఆ జట్టు ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ.. అవి చాలా సంక్లిష్టంగా ఉన్నాయి.

ఇతర టీమ్స్ ఫలితాల మీద ఆధారపడుతూనే.. బెంగళూరు మిగిలిన మ్యాచ్లలో భారీ తేడాతో విజయాన్ని దక్కించుకోవాలి. రన్ రేట్ ను భారీగా దక్కించుకోవాలి. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం బెంగళూరు మిగతా మ్యాచ్లలో గెలవడం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. అయితే ఆ గెలుపు మాత్రమే ఆ జట్టును ప్లే ఆఫ్ కు తీసుకెళ్లదు. అలాగని బెంగళూరును తక్కువ చేయడానికి లేదు. 2016లో తొలి ఏడు మ్యాచ్లలో బెంగళూరు ఒకదాంట్లో మాత్రమే విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో ఫైనల్ వెళ్ళింది. ఈ సీజన్లో అలాంటి ప్రదర్శన చేస్తుందని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు. అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్ముతున్నారు.