ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్దిరోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ట్రెండ్స్ పరంగా చూస్తే ఐపీఎల్ ప్రారంభమైన కొత్తల్లో ‘చెన్నై సూపర్ కింగ్స్’ అరవీర భయంకర జట్టు. వరుసగా ట్రోఫీలు నెగ్గింది. కానీ గత కొన్ని ఏళ్లుగా ఆ జట్టు తేలిపోతోంది. పోయిన సారి లీగ్ దశలోనే నిష్ర్కమించింది. పరుగులు చేయడానికి ధోనికి కూడా కష్టమవుతోంది. రిటైర్ కావడంతో ధోని శక్తిసామర్థ్యాలు సరిపోవడం లేదు. ఆ జట్టుకు బలమైన ఆటగాళ్లు కూడా లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది.
ఈసారి కూడా అంతే. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ జట్టు అయినా గెలవాలంటే అందులోని టాప్ బ్యాట్స్ మెన్ టాప్ లో ఉండాలి. ముంబై ఇండియన్స్ కు డికాక్, రోహిత్, సూర్యకుమార్, ఇషాన్, హార్ధిక్ లాంటి టీమిండియా ఆటగాళ్లు ఉండడం ఆ జట్టుకు బలంగా మారింది.
కానీ చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 7లో నలుగురికి సరైన సన్నద్ధత లేదు.పైగా వారు రెగ్యులర్ అంతర్జాతీయ ఆటగాళ్లు కాదు. ఇదే ఆ జట్టు ప్రధాన లోపం. వన్ డౌన్ లో వచ్చే కీలకమైన సురేష్ రైనా క్రికెట్ నుంచి ఎప్పుడో తప్పుకున్నాడు. అతడు విఫలమైతే వారి విజయావకాశాలు మరింత దెబ్బతించాయి. టీమిండియాకు ఆడని రైనా ఇలా ఏడాదికోసారి ఆడితే ఆట గాడితప్పడం ఖాయం. ధోని పరిస్థితి కూడా అంతే.
ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై తొలి మ్యాచ్ లో తలపడనుంది. సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనిలాంటి వారంతా క్రికెట్ నుంచి రిటైర్ అయిన వారే. వారు అంతర్జాతీయ క్రికెట్ కానీ.. టీ20లు కానీ కొద్దిరోజులుగా ఆడడం లేదు. గాయం కారణంగా రవీంద్ర జడేజా సైతం టీమిండియాకు దూరమయ్యాడు.
అంటే టాప్ 7లో నలుగురు ఫామ్ లేరు అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ప్రత్యర్థులను తట్టుకుంటుందన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. రాబిన్ ఉతప్ప కూడా ఎప్పుడో రిటైర్ అయ్యాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ లాంటి యువకుడు ఇప్పుడు ఫాంలో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. మంచి గణాంకాలు సాధించాడు.
ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లిసిస్ సైతం కొద్దిరోజులుగా జట్టుకు దూరమయ్యాడు. అతడు చెన్నైకి ఆడుతున్నాడు. వయసు మీదపడిన డుప్లెసిస్ ఏ మేరకు రాణిస్తాడన్నది చెప్పడం కష్టమే.
దీన్ని బట్టి ప్రస్తుతం రవీంద్ర జడేజా కోలుకుంటే అతడు ముందు బ్యాటింగ్ చేస్తే టీంకు మంచిది. టీమిండియాకు ఆడుతున్న అతడి సేవలు చెన్నై వినియోగించుకోవాలి. ఇక ధోని సైతం 4వ నంబర్ లో వచ్చి జట్టుకు భారీ స్కోర్లు చేయాలి. అప్పుడే చెన్నై ఈ సీజన్ లో రాణించే అవకాశాలు ఉంటాయి. లేకుంటే పోయినసారిలాగే గల్లంతవుతుంది.