నాగార్జున సాగర్ లో ఎమ్మెల్యేగా పోటీకి దిగిన అభ్యర్థుల నామినేషన్లు పెద్ద ఎత్తున తిరస్కరించడం హాట్ టాపిక్ గా మారింది. 17 నామినేషన్లు తిరస్కరించి అధికారులు వారికి గట్టి షాక్ ఇచ్చారు. ఇందులో బీజేపీ రెబల్ కూడా ఉండడం చర్చనీయాంశమైంది.
నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి బుధవారంతో నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తంగా దాఖలైన నామినేషన్లు, వాటిలో సరైనవి.. తిరస్కరణకు గురైన వాటి వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 77 మంది అభ్యర్థుల నామినేషన్లకు అధికారులు స్క్రూటీని పూర్తి చేశారు. ఇందులో 17మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. బీజేపీ రెబల్ అభ్యర్థి నివేదిత రెడ్డితోపాటు ఆమె ఆద్మీ పార్టీ, మరో 15 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
మిగిలిన 60 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ఆమోదించారు. అంటే నాగార్జునసాగర్ లో బరిలో ఉండే అభబ్యర్థుల సంఖ్య అధికారికంగా 60 మంది అని తేలింది. ఇందులో ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈలోగా ఎవరూ వెనక్కి తగ్గకపోతే 60 మంది బరిలో నిలిచినట్లు అవుతుంది.
ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతుంది. మే 2న కౌంటింగ్ నిర్వహిస్తారు. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ సహా 60 మంది బరిలో ఉన్నారు.