WTC Final 2023 : డబ్ల్యూటీసి ఫైనల్ కు వికెట్ కీపర్ ఎవరో..? ఆ ఇద్దరి మధ్య పోటాపోటీ..?

వీరిలో శ్రీకర్ భరత్ ఇప్పటికే అరంగేట్రం చేయగా, ఇషాన్ కిషన్ టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో అతనికి అవకాశం వస్తుంది ఏమో అని పలువురు అంటున్నారు.

Written By: NARESH, Updated On : June 4, 2023 10:30 pm
Follow us on

WTC Final 2023 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్న భారత తుది జట్టులో ఎవరు ఉండాలి అనే దానిపై కీలకమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ గా ఎవరిని ఆడించాలనే దానిపై సీనియర్ క్రికెటర్లు, మాజీ క్రికెటర్ల నుంచి అనేక సూచనలు వస్తున్నాయి. కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, శ్రీకర్ భరత్ మధ్య పోటి తీవ్రంగా నెలకొంది. వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడుతున్న భారత జట్టు వికెట్ కీపర్ గా ఎవరిని ఆడించాలన్న సందిగ్ధతలో ఉంది. రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడటంతో ఈ చోటు ఖాళీ అయింది. పంత్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న దానిపై తీవ్రంగా మదనపడుతోంది భారత జట్టు యాజమాన్యం. ఈ ఫైనల్ మ్యాచ్ లో పంత్ లేకపోవడం ఇండియా జట్టుకు ఇబ్బందికరంగా మారింది. పంత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం ఎదురు చూస్తున్న భారత జట్టుకు ఇషాన్ కిషన్, శ్రీకర్ భరత్ కనిపిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరని ఆడించాలి అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

భారత్ జట్టును వేధిస్తున్న ఏకైక సమస్య అదే..

ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమైంది. అయితే భారత జట్టు ముందు ఒక సమస్య ఉంది. అదే వికెట్ కీపర్ ఎంపిక. తుది జట్టు ఎంపిక గురించి అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. వికెట్ కీపర్ ఎవరు అనేది ఇప్పటికీ భారత జట్టు తేల్చుకోలేకపోతోంది. రిషబ్ పంత్ స్థానంలో మామూలుగా అయితే కేఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉండేది. రాహుల్ కూడా గాయం బారిన పడడంతో ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఒకవేళ అతడు జట్టుతో ఉండి ఉంటే రాహుల్ నే వికెట్ కీపర్ గా వినియోగించుకునే అవకాశం ఉండేది. అప్పుడు మరొక అదనపు బౌలర్ ను తీసుకునే వెసులుబాటు భారత జట్టుకు ఉండేది. ఇప్పుడు మాత్రం వికెట్ కీపర్ పోస్ట్ కోసం ఇద్దరు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వీరిలో శ్రీకర్ భరత్ ఇప్పటికే అరంగేట్రం చేయగా, ఇషాన్ కిషన్ టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో అతనికి అవకాశం వస్తుంది ఏమో అని పలువురు అంటున్నారు.

భరత్ వైపు మొగ్గు చూపుతున్న మోంగియా..

టీం ఇండియా మాజీ వికెట్ కీపర్ నయాన్ మోంగీయా మాత్రం భరత్ వైపు మొగ్గు చూపుతున్నాడు. భారత జట్టు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ను తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లాండులో ఆసీస్ తో జరిగే డబ్ల్యుటీసీ ఫైనల్ లో టీమ్ ఇండియా స్పెషలిస్ట్ కీపర్ తోనే బరిలోకి దిగాలి అని ఆయన వెల్లడించాడు. అందుకే భరత్ ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఏదో ఒక మ్యాచ్ లో సరిగా ఆడలేదని అతడు బ్యాడ్ కీపర్ అవ్వడని స్పష్టం చేశాడు. అతడు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అని, ఇప్పటి వరకు చాలా తక్కువ అవకాశాలు మాత్రమే వచ్చాయని స్పష్టం చేశాడు. తప్పనిసరిగా భరత్ కు అవకాశం కల్పించాలని సూచించాడు. ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, అక్కడ వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టమని స్పష్టం చేశాడు. ‘రోజంతా బంతిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. బంతి బౌన్స్ కావడం.. జారిపోవడం జరుగుతుంది. డ్యూక్స్ బంతులతో ఆడేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. కుకుబుర్రతో పోలిస్తే ఇలాంటి బాల్స్ తో ఆడటం ఇంకాస్త కష్టం. సీమ్ తోపాటు స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ గతంలో ప్రపంచ కప్ మ్యాచ్ లు ఆడాను. అందుకే అక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది’ అని మోంగియా స్పష్టం చేశాడు. చూడాలి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని బీసీసీఐ గాని జట్టు మేనేజ్మెంట్ గాని పరిగణలోకి తీసుకుంటుందో లేదో. ఏది ఏమైనా మరో రెండు రోజుల్లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానున్న దశలో ఎప్పటికీ వికెట్ కీపర్ ఎవరైనా దానిపై స్పష్టత రాకపోవడం కొంత ఆందోళనకు గురి చేసే అంశంగానే నిపుణులు చెబుతున్నారు.