Homeక్రీడలుWTC Final 2023 : టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా ప్రధాన లోపం ఇదే.....

WTC Final 2023 : టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా ప్రధాన లోపం ఇదే.. అధిగమించాల్సినవి ఇవే

WTC Final 2023 : ఐపీఎల్ హంగామా ముగిసింది. భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసి ఫైనల్ కోసం సిద్ధమవుతోంది. మొదటిసారి జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఎదురైన పరాభవం నుంచి గుణపాఠం నేర్చుకుని విజయం సాధించాలనే దిశగా భారత జట్టు ప్రయాణం సాగిస్తోంది. అయితే, మొదటిసారి జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది భారత జట్టు. ఈసారి జరగనున్న డబ్ల్యూటీసి ఫైనల్ లో ఆ లోపాలను సరిదిద్దుకుంటే విజయం సాధించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మొదటిసారి నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా భారత జట్టు బరిలోకి దిగింది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండడంతోపాటు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపించింది. దీంతో టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ భారత్ వశం అవుతుందని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి మూటగట్టుకుంది. ఈ ఏడాది జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో మాత్రం ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని మెరుగైన ప్రదర్శన చేయాలన్న కసితో భారత జట్టు కనిపిస్తోంది. అయితే, బ్యాటింగ్ వైఫల్యాలు ఎంత వరకు మెరుగుపర్చుకుంటుంది అన్న దానిని బట్టే భారత్ విజయం ఆధారపడి ఉంటుంది.

సమతూకంగా కనిపిస్తున్న భారత జట్టు..

డబ్ల్యూటీసి ఫైనల్ కు వరుసగా రెండోసారి భారత జట్టు చేరింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్ కు సీనియర్లు, స్టార్ బ్యాటర్లు, యువ క్రికెటర్లతో నిండి ఉన్న జట్టును ఎంపిక చేశారు. అన్ని రంగాల్లోనూ సమతూకంగా జట్టు ప్రస్తుతం కనిపిస్తోంది. దీంతో బ్యాటింగ్ లో సత్తా సాటి డబ్ల్యూటీసి కప్ చేజిక్కించుకోవాలని భారత జట్టు భావిస్తోంది.

భారత బ్యాటర్లు.. కంగారు బౌలర్ల మధ్య ప్రధాన పోటీ..

ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అనగానే ప్రధానంగా భారత బ్యాటర్లకు, కంగారు బౌలర్లకు మధ్య పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. 2021 లోనూ అంచనాలను అందుకోలేక, ఒత్తిడికి నిలబడలేక టీమ్ ఇండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇంగ్లీష్ గడ్డపై కివిస్ పేసర్లు ధాటికి చేతులెత్తేశారు. అప్పుడు రోహిత్ శర్మ, గిల్, పుజారా, విరాట్ కోహ్లీ అజంక్య రహానే, పంత్, జడేజా, అశ్విన్ తో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ బరిలో దిగింది. ఈసారి పంత్ మినహా మిగతా ఆటగాళ్లు అందరూ జట్టులో ఉన్నారు. ఇప్పుడు మన బ్యాటింగ్ విభాగాన్ని చూస్తే కొంత అయోమయంగానే కనిపిస్తోంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, పంత్ దూరం అవడం జట్టుకు పెద్ద దెబ్బగానే భావించాలి. అది కాకుండా గతంలో లాగే ఇప్పుడు కూడా ఆటగాళ్లు ఐపిఎల్ ఆడి వచ్చారు. ఈ లీగ్ లో ఆట వేరు. ఇక్కడ నిరంతరంగా మ్యాచులు ఆడి ఆటగాళ్లు అలసిపోతారు. ఇప్పుడు డబ్ల్యూటిసి ఫైనల్ కు తగ్గట్టుగా ఆటతీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సుదీర్ఘ ఫార్మాట్ కు అనుగుణంగా ఆటలో సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు అదే ఇంగ్లాండులోని కఠిన పరిస్థితుల్లో కంగారు బౌలర్ల సవాల్ ను దాటి మన బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్నది కీలకంగా మారింది.

ఆ ఇద్దరు ఆటగాళ్లు నిలబడితే మెరుగైన ప్రదర్శన..

డబ్ల్యూటీసి ఫైనల్లో పుజారా, కోహ్లీలతో ఆస్ట్రేలియాకు ప్రమాదమే అని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. పుజారా, కోహ్లీ నిలబడితే ఈ తుది పోరులో భారత్ కు తిరిగి ఉండదు. వీళ్ళ ప్రస్తుత ఫామ్ కూడా అంచనాలను పెంచే విధంగా ఉంది. ఈ డబ్ల్యూటీసి సైకిల్లో భారత తరఫున బ్యాటింగ్ లో ఉత్తమ ప్రదర్శన చేసిన తొలి ఇద్దరు ఆటగాళ్లు పుజారా(887), కోహ్లీ (869) పరుగులతో ముందు వరుసలో ఉన్నారు. ఇంగ్లాండ్లోని కౌంటిల్లో ఆడుతూ అక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకున్న పుజారా జట్టుకు కీలకం కానున్నాడు. ససెక్స్ తరఫున ఈ సీజన్లో అతను 68.12 సగటుతో 545 పరుగులు చేయడం విశేషం. ఇక ఆస్ట్రేలియా అంటే చాలు పుజారా పరుగులు వేటలో ముందుంటాడు. ఇప్పటి వరకు ఆ జట్టుపై 24 టెస్టుల్లో 2033 పరుగులు సాధించాడు. మరోవైపు చివరగా ఆడిన టెస్టు (అహ్మదాబాద్) లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 186 పరుగులు చేసిన కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్లో మూడు ఏళ్ల శతక నిరీక్షణకు  తెరదించాడు. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ లో భారత తరఫున అత్యధిక పరుగులతో నాలుగు మ్యాచ్ ల్లో 297 పరుగులు చేసి జోరు అందుకున్న విరాట్ కోహ్లీ.. ఇటీవల ఐపీఎల్ లోనూ దూకుడు కొనసాగించాడు. ఇక ఆసీస్ అంటే అతనికి కూడా ప్రియమైన ప్రత్యర్థే. ఈ జట్టుపై ఇప్పటి వరకు 24 టెస్టుల్లో 1979 పరుగులు సాధించాడు. డబ్ల్యూటీసి ఫైనల్ కు వేదికైనా ఓవల్ లో టీమ్ ఇండియా చివరిగా ఆడిన టెస్టులోనూ (50, 44) మంచి ప్రదర్శన చేశాడు.

వారిద్దరిపైనా ఆశలు పెట్టుకున్న భారత జట్టు..

ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్న గిల్ పై భారత్ జట్టు ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. ఇటీవల ఐపీఎల్ లో ఈ యువ ఓపెనర్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ లీగ్ అనే కాకుండా 2023లో అంతర్జాతీయ క్రికెట్లో గిల్ జోరు మామూలుగా లేదు. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఆడి ఒక శతకం సహా 154 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతను మంచి ఆరంభాలు ఇస్తే జట్టు విజయ అవకాశాలు మెరుగుపడినట్లే. మరోవైపు బ్యాటింగ్ లో సాధికారత ప్రదర్శించలేకపోతున్న రోహిత్ ఓవల్ లో మంచి రికార్డు ఉండడం కలిసి వచ్చే అంశం. అక్కడ ఒకే టెస్ట్ (2021లో) ఇంగ్లాండ్ తో ఆడిన అతను అందులో సెంచరీ సాధించాడు. ఇక ఇంగ్లాండ్ లోనూ ఐదు మ్యాచ్ లో 402 పరుగులతో రోహిత్ ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది. 16 నెలల తర్వాత మళ్లీ టెస్ట్ జట్టుకు ఎంపికైన రహానే కూడా లయ అందుకున్నాడు. ఐపీఎల్ లో ధనాధన్ ఇన్నింగ్స్ తో తనలోని కొత్త బ్యాటర్ ను చూపించిన అతను ఈ ఫైనల్ లోను అదే దృక్పథంతో ఆడతానని స్పష్టం చేశాడు.

పంత్ లేని లోటు తీరేనా..?

జట్టు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు దూకుడైన బ్యాటింగ్ తో ఆదుకునే పంత్ లేకపోవడం ఇండియాకు గట్టి దెబ్బే. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్న అతనికి విదేశాల్లో మంచి రికార్డు ఉంది. ఓవల్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో రెండు ఇన్నింగ్స్ లో వరుసగా 114, 50 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఈ డబ్ల్యూటిసి చక్రంలో అతను 12 మ్యాచుల్లో 868 పరుగులు చేశాడు. మరి కెఎస్ భరత్ లేదా ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాటర్ గా అతని లోటు తీరుస్తారేమో చూడాలి. ఇంగ్లాండ్ లో, అందులోనూ ఓవల్ లో రెండు మ్యాచ్ ల్లో 249 పరుగులు సాధించి మంచి రికార్డు ఉన్న కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో లేడు. మరోవైపు కొంత కాలంగా టెస్టుల్లో భారత బ్యాటింగ్ లోయర్ ఆర్డర్ ప్రదర్శన కీలకంగా మారింది. ఈ డబ్ల్యూటిసి సైకిల్ లో మన లోయర్ ఆర్డర్ (ఆరు నుంచి తొమ్మిది వరకు) బ్యాటర్లు 31 ఇన్నింగ్స్ లో 2,935 పరుగులు చేశారు. సగటు 27.40 గా ఉంది. మిగతా జట్లతో పోలిస్తే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ సగటులో ఇదే అత్యుత్తమం. ఆటగాళ్ల పరంగా చూస్తే అక్షర పటేల్ (45.80 సగటు) పంత్ (43.40), జడేజా (37.39) ప్రదర్శన మెరుగ్గా ఉంది. అదే టాప్ ఫైవ్ బాటర్ల ఉమ్మడి ప్రదర్శన పరిగణలోకి తీసుకుంటే 33 ఇన్నింగ్స్ లో 34.30 సగటుతో భారత ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ లో జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, సార్ధూల్ లో ఎవరు లోయర్ ఆర్డర్లో ఆడినా వారి బ్యాటింగ్ కూడా కీలకము అవుతుంది. బ్యాటింగ్ లో జడేజా (10 మ్యాచ్ ల్లో 563) కు ఇంగ్లాండులో ఉత్తమ రికార్డు ఉంది. ఓవల్ లో అయితే రెండు మ్యాచ్ ల్లో కలిపి 126 పరుగులు సాధించాడు. వీరంతా కలిసి సమష్టి ప్రదర్శన చేస్తే ఆస్ట్రేలియా జట్టును ముప్పు, తిప్పలు పెట్టే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version