Jay Shah: ఐసీసీ చైర్మన్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 27 (మంగళవారం) చివరి రోజు. ఈ పదవి కోసం జై షా మినహా మిగతా వారెవరూ దరఖాస్తులు దాఖలు చేయలేదు. దీంతో ఐసీసీ చైర్మన్ గా జై షా ఎన్నిక లాంఛనం అయింది. ఐసీసీ చైర్మన్ గా జై షా త్వరలో పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. అలా ఐసీసీ చైర్మన్ గా 35 సంవత్సరాల వయసులోనే బాధ్యతలు స్వీకరించే వ్యక్తిగా జై షా రికార్డు సృష్టించారు. ఈ అత్యున్నత పదవిని ఇంత చిన్న వయసులో ఇంతవరకు ఎవరూ అధిష్టించలేకపోయారు. ఐసీసీ చైర్మన్ గా నియమితుడైన ఐదవ భారతీయుడు జై షా. ఇతరికంటే ముందు జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ ఉన్నారు. జై షా ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత ఆయనకు అందే వేతనానికి సంబంధించిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఆయనకు జీతం ఎంత ఇస్తారు? మిగతా భత్యాలు ఎలా ఉంటాయి? ఎలాంటి సౌకర్యాలు అందుతాయి? అనే విషయాలను సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు తెగ శోధిస్తున్నారు.
స్థిర వేతనాలు ఇవ్వడం లేదు
ఐసీసీ చైర్మన్, ఇతర పదవుల్లో నియమితులైన వారికి స్థిరమైన వేతనాలు ఇవ్వడం లేదు. కాకపోతే వారికి వివిధ రూపాలలో భత్యాలు, ప్రయోజనాలు, అదనపు చెల్లింపుల అవకాశం కల్పిస్తోంది. అయితే వీటికి సంబంధించి ఇంతవరకు ఐసీసీ ఎటువంటి వివరాలనూ బహిర్గతం చేయలేదు. జై షా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐసీసీ అందించే అన్ని ప్రయోజనాలు ఆయనకు దక్కుతాయి. సౌకర్యాలు కూడా లభిస్తాయి.
బీసీసీఐ సెక్రటరీగా ఉన్నప్పుడు..
ఇప్పటికీ జై షా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. విదేశాలలో జరిగే ఐసీసీ సమావేశాలకు హాజరైనప్పుడు, ఇతర పర్యటనలకు వెళ్ళినప్పుడు ప్రతిరోజు భత్యంగా భారత క్రికెటర్ నియంత్రణ మండలి ₹84,000 చెల్లించేది. మనదేశంలో జరిగే సమావేశాలకు వెళ్ళినప్పుడు 40 వేలు ఇవ్వడంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు భరించేది. అయితే ఇందులో బిజినెస్ క్లాస్ లోనే జై షా కు ప్రయాణ సదుపాయం కల్పించేది. సమావేశాలు కాకుండా ఇతర క్రికెట్ సంఘాలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు జై షా కు ప్రతిరోజు 30,000 భత్యంగా లభించేది..
బీసీసీఐ లో కూడా..
బీసీసీఐలో కూడా ఐసీసీ మాదిరి ఆఫీస్ బేరర్స్ కు స్థిరమైన వేతనాలు లేవు. కేవలం అదనపు ప్రయోజనాలు, భత్యాలు, ఇతర చెల్లింపులు మాత్రమే వారికి లభిస్తున్నాయి. ఐసీసీ చైర్మన్ గా జై షా నియమితులైనప్పటికీ.. చెల్లింపుల విధానంలో పెద్దగా మార్పు ఉండదని వార్తలు వినిపిస్తున్నాయి. “ప్రపంచ క్రికెట్ ను పర్యవేక్షించే ఐసిసికి ప్రతి ఏడాది వేలకోట్లల్లో ఆదాయం వస్తుంది. ఇతర దేశాలకు పంచగా, భారీగానే మిగులుతుంది. బయటకు చెప్పరు గాని.. వచ్చిన ఆదాయంలో ఐసీసీ చైర్మన్ కు కూడా వాటా ఉంటుంది. అదే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాంటప్పుడు కొత్తగా వేతనం ఇవ్వాల్సిన అవసరం ఏముందని” స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.