West Indies vs Uganda : టి20 ప్రపంచ కప్ లో సరికొత్త సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్ లు సూపర్ ఓవర్ దాక వెళ్ళగా.. మరికొన్ని మ్యాచులు చివరి వరకు ఉత్కంఠ గా సాగాయి. మొత్తానికి ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో బౌలర్లదే ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.. అయితే ఆదివారం వెస్టిండీస్, ఉగాండా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సంచలనం నమోదయింది. టి20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ రికార్డయింది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో నమిబియా, స్కాట్లాండ్, కెనడా, అమెరికా వంటి పసికూన లాంటి జట్లు దుమ్మురేపుతుంటే.. ఉగాండా మాత్రం సత్తా చూపడం లేదు. పైగా దారుణమైన బ్యాటింగ్, బౌలింగ్ అంతకంటే చెత్త ఫీల్డింగ్ తో అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది.
వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 39 పరుగులకే ఆల్ అవుటై, ఉగాండా తన పసికూనతత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. గల్లి స్థాయికి దిగజారిన ఆట తీరు ప్రదర్శించి పరువు తీసుకుంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్ 44, అండ్రి రస్సెల్ 30* విధ్వంసకర ఆట తీరు ప్రదర్శించడంతో వెస్టిండీస్ ఆ స్కోర్ చేయగలిగింది. ఉగాండా బౌలర్లలో మసాబా రెండు వికెట్లు పడగొట్టాడు. రామ్ జనీ, కోస్మాస్, దినేష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
174 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన ఉగాండా.. కేవలం 12 ఓవర్లలో 39 పరుగులకే కుప్ప కూలింది. వెస్టిండీస్ బౌలర్లలో అఖిల్ హోస్సేన్ ఐదు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అల్జారి జోసెఫ్ 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. రోమారియో షెఫర్డ్ , మోతీ, ఆండ్రి రసెల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఈ గెలుపు ద్వారా t20 ప్రపంచ కప్ చరిత్రలో పరుగులపరంగా భారీ విక్టరీ సాధించిన రెండవ జట్టుగా వెస్టిండీస్ రికార్డ్ సృష్టించింది. వెస్టిండీస్ కంటే శ్రీలంక ఈ జాబితాలో ముందుంది. 2007 టి20 ప్రపంచ కప్ లో శ్రీలంక 172 పరుగుల తేడాతో కెన్యా జట్టును ఓడించింది. పరుగులపరంగా శ్రీలంక జట్టు దే అతిపెద్ద విజయం. రెండో స్థానంలో తాజా విజయం (134 పరుగుల భారీ తేడా) తో వెస్టిండీస్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ విజయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా ను వెస్టిండీస్ అధిగమించింది. 2021 t20 ప్రపంచ కప్ లో ఆఫ్గనిస్తాన్ స్కాట్లాండ్ పై 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక తాజా ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉగాండా జట్టుపై 125 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 2009 t20 ప్రపంచ కప్ లో స్కాట్లాండ్ జట్టును దక్షిణాఫ్రికా 130 పరుగుల తేడాతో మట్టి కరిపించింది.