https://oktelugu.com/

Bandi Sanjay : బడి పంతులు కొడుకు.. కేంద్ర మంత్రిగా.. ఇదీ బండి సంజయ్‌ ‘కమల’ ప్రయాణం..

Bandi Sanjay ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగారు సంజయ్‌. ఈసారి 2,25,209 భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2024 / 07:54 PM IST

    Bandi Sanjay

    Follow us on

    Bandi Sanjay : ఆయన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని కుమారుడు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా.. ఏబీవీపీ నాయకుడిగా రాజకీయ స్థ్రానం ప్రారంభించాడు. నేడు కేంద్ర మంత్రిగా ఎదిగాడు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోదీ కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అతనే కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్.

    మధ్య తరగతి కుంటుంబంలో..
    తెలంగాణ బీజేపీలో ఉన్న కీలక నేతల్లో బండి సంజయ్‌ ఒకరు. 1971, జులై 11న మధ్య తరగతికి చెందిన శకుంతల, నర్సయ్య దంపతులకు జన్మించారు సంజయ్. ఆయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. సరస్వతి శిశుమందిర్‌‌లో విద్యాభ్యాసం చేసిన బండి సంజయ్‌.. చిన్నప్పటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రాథమిక విద్య స్థాయిలోనే ఘటన్‌ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా పనిచేశారు.

    ఏబీవీపీ నాయకుడిగా..
    విద్యార్థి దశలో ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్)లో చురుగ్గా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన పనితీరును గుర్తించి కరీంనగర్ పట్టణ కన్వీనర్‌గా, పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎదిగారు. 1994-2003 మధ్యకాలంలో “ది కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌” డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తర్వాత బీజేపీలో వివిధ హోదాల్లో సంజయ్ పని చేశారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్‌చార్జిగా పని చేశారు. ఎల్‌కే.అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ భాగస్వామయ్యారు. 35 రోజులు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు.

    కార్పొరేటర్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి..
    ఇక 2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా బండి సంజయ్ తొలి విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. రెండుసార్లు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంజయ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 3చ163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మూడుసార్లు బీఆర్‌ఎస్‌(టీఆర్ఎస్) అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలోనే ఓడిపోయారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫు కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన సంజయ్.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.వినోద్‌ కుమార్‌పై 89,508 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు.

    బీజేపీ రాష్ట్ర అధ‍్యక్షుడిగా..
    ఇక 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత జాతీయ నాయకత్వం అతడి పనితీరు గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. 2020లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంజయ్‌ బీజేపీకి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత మైలేజీ తీసుకొచ్చారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. పట్టణాలకే పరిమితమైన పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లారు. ఆయన సారథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. దీంతో ఆయన నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది.

    అనూహ్యంగా పదవి నుంచి తప్పించి..
    అయితే.. పార్టీ పరమైన నిర్ణయాల్లో భాగంగా.. 2023 జులై 4న బీజేపీ అధిష్టానం బండి సంజయ్‌ను అధిష్టానం అనూహ్యంగా అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించింది. అయితే అదే నెల 29న సంజయ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి గౌరవించింది. 2024 జనవరి 3న కిసాన్ మోర్చా జాతీయ ఇన్‌చార్జిగా బండి సంజయ్‌ నియమితులయ్యారు.

    ఎంపీగా రెండోసారి ఘన విజయం..
    ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగారు సంజయ్‌. ఈసారి 2,25,209 భారీ మెజారిటీతో విజయం సాధించారు. కరీంనగర్‌కు వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచి సత్తా చాటారు. దీంతో.. మోదీ జట్టులో స్థానం సంపాదించుకున్నారు బండి సంజయ్.