https://oktelugu.com/

JP Nadda : నడ్డాకు కేంద్ర మంత్రి పదవి : బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా ?

JP Nadda : నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. మంత్రులుగా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, జై శంకర్ వంటి వారు ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డాను కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడంతో.. ఆ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2024 8:38 pm
    JP Nadda

    JP Nadda

    Follow us on

    JP Nadda : భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ముచ్చటగా మూడవసారి ఆయన దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 ఎన్నికల్లోనూ అద్భుతమైన విజయాన్ని సాధించి రెండవసారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు దక్కడంతో, ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు.

    ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8,000 మంది దేశ, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. సార్క్ దేశాల ప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీయు అధినేత నితీష్ కుమార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ, సినీ నటులు షారుక్ ఖాన్, రజనీకాంత్, ఆధ్యాత్మికవేత్త చిన జీయర్ స్వామి హాజరయ్యారు.

    నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. మంత్రులుగా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, జై శంకర్ వంటి వారు ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జేపీ నడ్డాను కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడంతో.. ఆ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో స్థానాలు దక్కకపోవడంతో పార్టీని మరింత ప్రక్షాళన చేయాలని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సంఘ్ కు దగ్గరగా ఉన్న వ్యక్తిని బిజెపి అధ్యక్షుడిగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ.. వారికి ఎటువంటి శాఖలు కేటాయించారో తెలియ రాలేదు.