Homeక్రీడలుWest Indies Vs Scotland: వెస్టిండీస్ కు షాక్ ఇచ్చిన స్కాట్లాండ్.. వరల్డ్ కప్ కు...

West Indies Vs Scotland: వెస్టిండీస్ కు షాక్ ఇచ్చిన స్కాట్లాండ్.. వరల్డ్ కప్ కు అర్హత సాధించని వెస్టిండీస్..!

West Indies Vs Scotland: వెస్టిండీస్ జట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన పరాభవాలను మూటగట్టుకుంటోంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడుతున్న వెస్టిండీస్ దారుణమైన ఆట తీరు కనబరుస్తోంది. కొద్ది రోజుల కిందట నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 350 కిపైగా పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు.. భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. సూపర్ ఓవర్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టిన నెదర్లాండ్స్ జట్టు వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది. తాజాగా క్రికెట్లో అతి చిన్న జట్టు అయిన స్కాట్లాండ్ పై కూడా వెస్టిండీస్ జట్టు దారుణంగా ఓడిపోయి వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయింది.

అంతర్జాతీయ క్రికెట్ లో వెస్టిండీస్ జట్టు ఒక సంచలనం అనే చెప్పాలి. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో ఈ జట్టు ఎప్పుడూ కూడా అత్యంత భయంకరమైనదే. అరవీర భయంకరమైన హిట్టింగ్ చేయగల బ్యాటర్లు ఈ జట్టులో ఎక్కువ మంది ఉంటారు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల విధ్వంసకారులకు ఈ జట్టు పెట్టింది పేరు. అటువంటి వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ క్వాలిఫైయర్ లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో పసి కూనలపై ఓడిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొన్న నెదర్లాండ్స్ జట్టుపై దారుణంగా ఓడిపోయిన విషయాన్ని మర్చిపోకముందే.. శనివారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ దారుణంగా ఓడిపోయింది వెస్టిండీస్ జట్టు. ఈ ఓటమితో వెస్టిండీస్ జట్టు వరల్డ్ కప్ మ్యాచ్లకు క్వాలిఫై కాలేకపోయింది. వరల్డ్ కప్ మ్యాచ్లకు వెస్టిండీస్ జట్టు క్వాలిఫై కాకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

181 పరుగులకు ఆల్ అవుట్ అయిన వెస్టిండీస్..

వెస్టిండీస్ జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ఆట తీరు మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా పోయింది. సూపర్ సిక్స్ లో భాగంగా హరారే వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు స్కాట్లాండ్ తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 10 వికెట్ల నష్టానికి 181 పరుగుల చేసింది. ఈ జట్టులో బ్రండన్ కింగ్ 22 బంతుల్లో 22 పరుగులు చేయగా, హోల్డర్ 79 బంతుల్లో 45 పరుగులు, షెపర్డ్ 43 బంతుల్లో 36 పరుగులు, పూరన్ 43 బంతుల్లో 21 పరుగులు చేశారు. చార్లెస్, బ్రూక్స్, సాయ్ హోప్, మేయర్స్ తోపాటు మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 37 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ జట్టు ఆల్ అవుట్ అయింది. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రండన్ మెక్కల్లెన్ మూడు, క్రిష్ షోలే, మార్కు వ్యాట్, క్రిస్ గ్రేవ్స్ రెండేసి, షరీఫ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేదించిన స్కాట్లాండ్..

వెస్టిండీస్ జట్టు విధించిన స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్ జట్టు ఆడుతూ పాడుతూ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మాథ్యూ క్రాస్ 107 బంతుల్లో 74 పరుగులు, బ్రండన్ మెక్కల్లెన్ 106 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించారు. జార్జ్ మున్షీ 33 బంతుల్లో 18 పరుగులు, బెర్రింగ్ టన్ 14 బంతుల్లో 13 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించి పెట్టారు. వెస్టిండీస్ బౌలర్లలో హోల్డర్, షెపర్డ్, అకెల్ హోసాయేన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular