Gautam Gambhir: గెలిచినప్పుడు అభినందించడం.. ఓడినప్పుడు విమర్శించడం క్రికెట్లో సర్వసాధారణం. కాకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ముందు టీమిండియా పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలవడం.. రోజుల వ్యవధిలోనే 10 వికెట్ల తేడాతో ఆడిలైడ్ టెస్ట్ లో ఓడిపోవడం సగటు అభిమానిని ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో ఆటగాళ్లపై ఆగ్రహానికి కారణమవుతోంది. తొలి టెస్ట్ లో 160+ రన్స్ చేసిన యశస్వి జైస్వాల్.. రెండవ టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ లో అనవసరంగా అవుట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జట్టుకు అత్యంత అవసరమైన టెస్టులో ఓడిపోవడం టీం ఇండియా మేనేజ్మెంట్ ను కలవరపరుస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాడు హర్షిత్ రాణా విషయంలో గౌతమ్ గంభీర్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. హర్షిత్ ను గంభీర్ ఏరికోరి ఎంపిక చేశాడు. తొలి టెస్టులో బుమ్రా బౌలింగ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ వల్ల హర్షిత్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండో టెస్టులో హర్షిత్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్లో రెండు ఇన్నింగ్స్ లలోనూ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు.
గౌతమ్ గంభీర్ పై ఒత్తిడి
హర్షిత్ కోల్ కతా జట్టులో ఆడుతున్నాడు. గత ఐపీఎల్ లో సత్తా చాటాడు. అతడి బౌలింగ్ నచ్చి గౌతమ్ గంభీర్ జాతీయ జట్టులోకి తీసుకున్నాడు. అయితే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో హర్షిత్ విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. తొలి టెస్ట్ లో పర్వాలేదనిపించగా.. రెండో టెస్టులో మాత్రం అతడు అత్యంత నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించాడు. బౌలింగ్ లో తేలిపోయాడు. బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. తొలి టెస్టులో దేవదత్, ధ్రువ్ సత్తా చాట లేకపోవడంతో రెండవ టెస్టుకు దూరం పెట్టారు. వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకోలేకపోవడంతో అతడిని కూడా రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశారు. అయితే ఇప్పుడు హర్షిత్ విషయంలో కూడా మేనేజ్మెంట్ అలానే చేయాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అతడిని గనుక మూడో టెస్టులో ఆడిస్తే గౌతమ్ గంభీర్ పై విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్లే మూడో టెస్టులో హర్షిత్ కు అవకాశం లభించకపోవచ్చని తెలుస్తోంది. హర్షిత్ విషయంలో మరోసారి పునరాలోచన చేసే దిశగా గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ” జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పుడు కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. సరిగా ప్రతిభ చూపని ఆటగాళ్లను జట్టులో ఉంచుకుంటే వాళ్లు భారంగా మారే ప్రమాదం లేకపోలేదు. అలాంటప్పుడు హర్షిత్ లాంటి ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడం చాలా ఇబ్బందికరమైన వాతావరణం. బహుశా మూడో టెస్టులో అతనికి అవకాశం దక్కకపోవచ్చని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.