Virat Kohli : తనకు ఎంతటి స్టార్ డం ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ పట్టించుకోడు. కొత్త పాత అని తేడా లేకుండా ఆటగాళ్లతో కలిసి పోతాడు. విలేకరుల సమావేశం నిర్వహించినప్పుడు చలోక్తులు విసురుతూ నవ్వులు పూయిస్తాడు. గంభీరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా సరదాగా మార్చేస్తాడు. విరాట్ కోహ్లీ సరదాగా ఉన్నంత మాత్రాన.. తన హద్దులు మర్చిపోడు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో.. అంతవరకే మాట్లాడుతాడు. పొరపాటున కూడా తప్పులకు ఆస్కారం ఇవ్వడు.. అయితే అలాంటి కోహ్లీ ఒక సందర్భంలో సచిన్ పాదాలను తాకాల్సి వచ్చిందట. స్వతహాగా ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే విరాట్.. సీనియర్లు చెప్పడం వల్ల ఆ పని చేయాల్సి వచ్చిందని ఇటీవల వెల్లడించాడు. దీంతో అది కాస్త సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది..
జట్టులోకి వచ్చిన కొత్తలో..
విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాలోకి వచ్చిన తొలి నాళ్లల్లో.. ఇతర ఆటగాళ్లతో కలవడానికి చాలా ఇబ్బంది పడేవాడు.. నాడు ఆశిష్ నెహ్ర, జహీర్ ఖాన్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం కోహ్లీకి ఇబ్బంది కలిగించేదట. అందువల్ల అతనికి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదట. అప్పట్లో యువరాజ్, మునాఫ్ పటేల్, హర్భజన్, ఇర్ఫాన్ పఠాన్ వంటి వారు చెబితే అది విరాట్ చేసేవాడట. యువకానొక సందర్భంలో సచిన్ కాళ్లు మొక్కాలని.. అలా అయితే మంచి జరుగుతుందని.. కెరియర్లో రాణిస్తావని.. సచిన్ ఆశీస్సులు అద్భుతంగా పనిచేస్తాయని.. నువ్వు జూనియర్ కాబట్టి అలాంటి పని చేయాలని.. అప్పుడే నువ్వు అద్భుతమైన క్రికెటర్ అవుతావని.. వారు విరాట్ తో వ్యాఖ్యానించారట.
నిజమని నమ్మి..
వారు చెప్పినవన్నీ నిజమవుతాయని భావించి విరాట్.. సచిన్ వద్దకు వెళ్లి పోయారట. ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసారట. ఆ తర్వాత సచిన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. ఎందుకిలా చేస్తున్నారని విరాట్ ను ప్రశ్నించారట. దీంతో షాక్ కు గురి కావడం విరాట్ వంతైందట. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని విరాట్ తనలో తానే నవ్వుకున్నారట. అయితే ఈ విషయాన్ని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇటీవల విరాట్ చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన సంఘటనను ఆయన మననం చేసుకుంటూ తనలో తానే నవ్వుకున్నారు. సీనియర్లు చెప్పారని సచిన్ కాళ్లు మొక్కానని విరాట్ నవ్వుతో కూడిన గొంతుతో చెప్పారు. దీంతో ఆ షో హోస్ట్ చేస్తున్న వ్యక్తికి కూడా గట్టిగా నవ్వారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో లక్షల్లో వీక్షణలు సొంతం చేసుకుంది. ఇదే సమయంలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది.
Virat Kohli talking about the prank happened while meeting Sachin Tendulkar. pic.twitter.com/hPclPm0X8K
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 7, 2024