https://oktelugu.com/

IND vs SA T20 Match :  మన సూరీడు.. రికార్డుల వేట మొదలు పెడితే.. సౌత్ ఆఫ్రికా గల్లంతు కావాల్సిందే..

న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా సౌత్ ఆఫ్రికా జట్టుతో నాలుగు టి20 మ్యాచ్ ల సిరీస్ కు రెడీ అవుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 8:26 am
    Surya Kumar Yadav

    Surya Kumar Yadav

    Follow us on

    IND vs SA T20 Match :  సూర్య కుమార్ ఆధ్వర్యంలో టీమిండియా ఇప్పటికే సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయింది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా మొదలవుతుంది. శుక్రవారం రాత్రి 8:30 నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్ లోనూ అదే జోరు కొనసాగించాలని భారత్ భావిస్తోంది. గత రికార్డుల పరంగా చూసుకుంటే భారత్ హాట్ ఫేవరెట్ గా కొనసాగుతోంది. అయితే టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అనేక రికార్డులు బద్దలు కొడతాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ 2021లో పొట్టి ఫార్మాట్ లో ప్రవేశించాడు. ఇప్పటివరకు 74 మ్యాచ్ లు ఆడాడు. 2,544 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. 21 హాఫ్ సెంచరీలున్నాయి.

    అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..

    సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా పై 346 రన్స్ చేశాడు. అతడు ఏడు మ్యాచ్లలో ఆడి ఈ ఘనత సాధించాడు. 175.63 స్ట్రైక్ రేట్ కొనసాగిస్తున్నాడు. ఇంకొక 107 పరుగులు చేస్తే సూర్య కుమార్ యాదవ్ టి20లలో సౌత్ ఆఫ్రికాపై హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. అయితే ఈ లిస్టులో సౌత్ ఆఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ 452 రన్స్ తో టాప్ ప్లేస్ లో ఉన్నాడు.. టి20లలో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు నాలుగు శతకాలు సాధించాడు. సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగే సిరీస్లో మరో రెండు సెంచరీలు చేస్తే, టి20 క్రికెట్లో హైయెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టిస్తాడు. ఇక ఈ లిస్టులో మాక్స్ వెల్ 5, రోహిత్ 5 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.. ఒకవేళ ఒక సెంచరీ చేసినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ వారి సరసన చేరతాడు. దూకుడైన బ్యాటింగ్.. బలమైన షాట్లు కొట్టే సూర్య కుమార్ యాదవ్.. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో టీమిండియా ఇప్పటివరకు రెండు టి20 సిరీస్ లు సొంతం చేసుకుంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఆ బాధ్యతలను స్వీకరించాడు. ఇటీవల శ్రీలంక, బంగ్లాదేశ్ పై టి20 సిరీస్ లను భారత జట్టు వైట్ వాష్ చేసింది.