https://oktelugu.com/

Australia vs England : ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యరీ బ్రూక్ సంచలన ఇన్నింగ్స్.. ఏకంగా విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డుకు బీటలు..

ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు, కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంచలనం సృష్టించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో చివరిదైన ఐదో మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 29, 2024 / 10:24 PM IST
    Follow us on

    Australia vs England : ఆదివారం బ్రిస్టల్ లో జరిగిన చివరి వన్డేలోనూ బ్రూక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 52 బంతుల్లో మూడు ఫోర్లు, 7 సిక్స్ లతో 72 పరుగులు చేశాడు.. ఓపెనర్ బెన్ డకెట్ 91 బంతుల్లో 107 పరుగులు చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్ కు ఏకంగా 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా బ్రూక్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియా పై ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ గా ఆవిర్భవించాడు. 5 వన్డే మ్యాచ్ లలో ఒక సెంచరీ సాధించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తంగా 312 పరుగులు చేశాడు. ఇదే సమయంలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ 310 రన్స్ చేశాడు. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ రికార్డ్ గా ఉంది. తాజాగా బ్రూక్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

    విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు

    ఆస్ట్రేలియాపై ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 312 పరుగులతో బ్రూక్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత 310 పరుగులతో విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో, 285 పరుగులతో మహేంద్ర సింగ్ ధోని మూడవ స్థానంలో, 278 పరుగులతో ఇయాన్ మోర్గాన్ నాలుగో స్థానంలో, 276 పరుగులతో బాబర్ అజాం నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు తొలి, రెండు వన్డేలను ఓడిపోయింది. మిగతా రెండు వన్డేలలో హ్యారీ బ్రూక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ రెండు వన్డేలను గెలిచింది. మూడో వన్డేలో బ్రూక్ 110 పరుగులతో సత్తా చాటాడు. ఆ మ్యాచ్లో 46 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును గెలిపించాడు. ఇక నాలుగో వన్డేలో 58 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. 186 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించాడు. చివరి వన్డేలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.. ఆస్ట్రేలియా బౌలర్ల పై ప్రారంభం నుంచి ఎదురుదాడికి దిగాడు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 309 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆరోన్, ఆడం జంపా, మాక్స్ వెల్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు..హెడ్ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టు ధాటిగా ఆడినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యంతో 309 పరుగులు చేయగలిగింది. ఒకవేళ వారు గనక నిలబడి ఉంటే ఇంగ్లాండ్ స్కోర్ 350 దాటిది.