Peddireddy Ramachandra Reddy YSRCP Exit News: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఒక బలమైన లీడర్ గుడ్ బై చెబుతారా? వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారా? అధినేత వైఖరి నచ్చడం లేదా? లేకుంటే కూటమి ప్రభుత్వం దూకుడు కారణమా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎవరో నేత అంటే చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొన్నటి కూటమి ప్రభంజనాన్ని కూడా తట్టుకున్నారు. తాను ఒక్కడిని గెలవడమే కాదు తన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ని తంబళ్లపల్లె నుంచి గెలిపించుకున్నారు. కుమారుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీ గాను గెలిచారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
* వైఎస్ కుటుంబ సన్నిహితుడు..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ( y s Rajasekhar Reddy ) అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ సాన్నిహిత్యం తోనే జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు పెద్దిరెడ్డి. గత దశాబ్ద కాలంగా బలమైన, తిరుగులేని నేతగా ఎదిగారు. పార్టీ తరఫున రాయలసీమ బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగించారు. అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు దూకుడు ప్రదర్శించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు క్రమేపి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటుంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం రాజీనామా చేయబోతోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆ ఫ్యామిలీ ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలు చూస్తుంటే మాత్రం పార్టీ మారుతారని బలమైన ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి ఫ్యామిలీతో పాటు వారి అనుచరుల వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో పెద్దిరెడ్డి మాటే శాసనం అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది.
* కూటమి వైపా?..
మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ( Mithun Reddy)అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుదీర్ఘకాలం రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అటు తర్వాత పెద్దిరెడ్డి పై సైతం అనేక కేసులు తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో దూకుడు కంటే మౌనం పాటించడమే మేలన్న నిర్ణయానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపు ఇచ్చిన కార్యక్రమాలను సైతం నిర్వహించలేని పరిస్థితి ఆ ఫ్యామిలీది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో జగన్ సైతం ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని వెతుక్కుంటున్నట్లు సమాచారం. అందుకే పెద్దిరెడ్డి తన దారి తాను చూసుకునే పనిలో ఉన్నారని లీకులు బయటకు వస్తున్నాయి. సాధారణంగా పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నేత బయటకు వెళ్లిపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం. కోలుకోలేని దెబ్బ కూడా. అయితే తనపై ఉన్న కేసుల ఒత్తిడి, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా.. పెద్దిరెడ్డి కూటమి వైపు వెళ్తారా? లేకుంటే స్వతంత్రంగా వ్యవహరిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది చిత్తూరు జిల్లా పొలిటికల్ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?